విద్యుత్‌ పెట్టుబడుల వెనుక గూడుపుఠాణీ..

ABN , First Publish Date - 2022-11-08T03:00:02+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ హిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇండోసోల్‌ కంపెనీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది.

విద్యుత్‌ పెట్టుబడుల వెనుక గూడుపుఠాణీ..

వార్షిక లాభం 50 కోట్లు లేని కంపెనీ

రూ.3.15 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతుందా?

కంపెనీ అధినేత విశ్వేశ్వర్‌రెడ్డి వెనుక ఎవరున్నారు?: రఘురామకృష్ణరాజు

న్యూఢిల్లీ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ హిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇండోసోల్‌ కంపెనీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మొత్తం రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీ తన సంసిద్ధతను తెలిపింది. వార్షిక లాభం రూ.40 నుంచి రూ.50 కోట్లకు మించి ఉండని షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ ఈ కంపెనీ ప్రమోటర్‌గా ఉంది. అంత చిన్న కంపెనీ అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడం అసాధ్యం. ఇంత పెద్ద మొత్తం పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ వెనుక, దాని యజమాని నర్రెడ్డి విశ్వేశ్వర్‌రెడ్డి వెనుక ఎవరున్నారు? వైసీపీ ప్రభుత్వం సదరు కంపెనీ చరిత్రను తరచిచూడకుండా ఇప్పటికే రూ.76 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం వెనుక అసలు కారణాలు ఏమిటి? రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల వెనుక దాగిన గూడుపుఠాణి ఏమిటి?’’ అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌, ఇండోసోల్‌ కంపెనీల ప్రతిపాదనలను వివరించారు. ఆ ప్రతిపాదనల అమలు సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ‘‘నెల్లూరు జిల్లా రామాయపట్నంలో సోలార్‌ ఎక్వి్‌పమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం ఇండోసోల్‌ అనే కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన షిరిడి సాయి ఎలక్ర్టికల్స్‌ యజమాని నర్రెడ్డి విశ్వేశ్వర్‌రెడ్డి ప్రతిపాదనలు చేశారు. దానికి అనుబంధంగా విద్యుత్‌ అవసరాల కోసం 7,200 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లు... ఇందులో 2,200 మెగా వాట్ల పంపుడ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌, 1,500 మెగా వాట్ల విండ్‌ పవర్‌ ప్లాంట్‌, 3,500 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. నర్రెడ్డి విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం మొత్తం 13,600 ఎకరాల కేటాయింపునకు సూత్రప్రాయంగా ప్రభుత్వం అంగీకరించింది. కేటాయించిన భూమిని కారుచవకగా తమకు అమ్మాలని నెడ్‌క్యా్‌పను సదరు సంస్థ కోరింది. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మెగావాట్ల సోలార్‌ పార్కుల ఏర్పాటుకు విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేశారు. ఒక్కొక్క మెగావాట్‌కు ఐదు ఎకరాల చొప్పున 2.50 లక్షల ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 50 వేల మెగావాట్ల సోలార్‌ పార్కుల ఏర్పాటుకు దాదాపు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. మొత్తంగా ఇండోసోల్‌ కంపెనీ ప్రమోటరుగా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. సదరు మొత్తంలో ప్రమోటరుగా విశ్వేశ్వర్‌రెడ్డి కనీసం రూ.30 వేల కోట్ల పెట్టుబడులైన సొంతంగా సమకూర్చాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టడానికి నర్రెడ్డి విశ్వేశ్వర్‌రెడ్డి వెనుక ఎవరున్నారు? అన్ని రూ.వేల కోట్ల పెట్టుబడులు కేవలం రాష్ట్రంలోనే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు?’’ అని రఘురామరాజు నిలదీశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని రఘురామరాజు హెచ్చరించారు. ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కింద 5 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రముఖ సినీ కథానాయకుడు కమల్‌హాసన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-11-08T03:00:03+05:30 IST