Group-1 Exam: ప్రశాంతంగా గ్రూపు-1 పరీక్షలు

ABN , First Publish Date - 2022-11-20T08:57:39+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు-1 పరీక్షలు(Group-1 Exam) శనివారం ప్రశాంతంగా జరిగాయి. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్సీ) నిర్వ

Group-1 Exam: ప్రశాంతంగా గ్రూపు-1 పరీక్షలు

- పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ

- 3.22 లక్షల మంది హాజరు

అడయార్‌(చెన్నై), నవంబరు 19: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు-1 పరీక్షలు(Group-1 Exam) శనివారం ప్రశాంతంగా జరిగాయి. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్సీ) నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 3.22 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 92 గ్రూపు-1 పోస్టుల భర్తీ కోసం ఈ రాత పరీక్షను నిర్వహించారు. గ్రూపు-1 విభాగంలో ఖాళీగా ఉన్న 18 సబ్‌ కలెక్టర్‌ పోస్టులను, 26 డీఎస్పీ పోస్టులు, వాణిజ్యపన్ను శాఖలో 25 అసిస్టెంట్‌ కమిషనర్‌, సహకార శాఖలో 13 డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు, గ్రామీణాభివృద్ధి శాఖలో 7 అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు, 3 జిల్లా అగ్నిమాపకదళ అధికారి పోస్టుల భర్తీ కోసం ఈ రాత పరీక్షలను నిర్వహించారు. ఈ రాతపరీక్షకు 3,22,414 అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,56,833 మంది పురుషులు, 1,65,557 మంది మహిళలు, 3,024 మంది థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు ఉన్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లో 1,080 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చెన్నై నగరంలో మైలాపూర్‌, రాయపేట, అన్నా నగర్‌, ఎగ్మోర్‌, వేప్పేరి, పెరంబూరు, వడపళని, తిరువొత్తియూరు, సైదాపేట, తిరువాన్మియూరు, వేళచ్చేరితో సహా 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు చెన్నై నగరం(Chennai city)లోనే ఏకంగా 45939 మంది హాజరుకాగా, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగాయి. పరీక్ష జరిగే సమయంలో టీఎన్‌పీఎస్సీ అధికారులు పలు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాగా, ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2022-11-20T08:57:41+05:30 IST