India vs Australia: చివర్లో చితక్కొట్టేసిన టిమ్ డేవిడ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ABN , First Publish Date - 2022-09-26T02:22:12+05:30 IST

భారత్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో చెలరేగి తడబడిన ఆసీస్ ఆ తర్వాత కుదురుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల

India vs Australia: చివర్లో చితక్కొట్టేసిన టిమ్ డేవిడ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో చెలరేగి తడబడిన ఆసీస్ ఆ తర్వాత కుదురుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి భారత్‌కు సవాలు విసిరింది. 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో కొత్త కుర్రాడు టిమ్ డేవిడ్ జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు.


150 పరుగులు కూడా కష్టమనుకున్న వేళ బంతిని నిర్దాక్షిణ్యంగా బాదుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించి 180 పరుగులు దాటించాడు. మొత్తంగా 27 బంతులు ఎదుర్కొన్న టిమ్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అతడికి డేనియల్ శామ్స్ అండగా నిలిచాడు. 20 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తన పాత్రను పోషించాడు. 


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఓపెనింగ్ లభించింది. ఓపెనర్లు కేమరన్ గ్రీన్ (52), అరోన్ ఫించ్ (7) తొలి వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో గ్రీన్ చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. 19 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. అయితే, భువనేశ్వర్ కుమార్ అతడిని వెనక్కి పంపిన తర్వాత కంగారూలకు క్రీజులో కుదురుకోవడం కష్టమైంది.


టీమిండియా బౌలర్లు వరసపెట్టి వికెట్లు తీస్తూ బ్యాటర్ల పనిపట్టారు. ఒక దశలో 44/1గా ఉన్న ఆసీస్ స్కోరు బౌలర్ల దెబ్బకు 84/4గా మారింది. అనంతరం 115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోగా, మరో రెండు పరుగుల తేడాతో మరో వికెట్ కోల్పోయింది. మొత్తంగా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అయితే, ఈ దశలో క్రీజులో పాతుకుపోయిన టిమ్ డేవిడ్ ఆసీస్ ఆశలకు ఊపిరి పోసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గ్రీన్ 52, జోష్ ఇంగ్లిష్ 24, డేనియల్ శామ్స్ 28 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసుకోగా, భువీ, చాహల్, హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2022-09-26T02:22:12+05:30 IST