Governor Tamilisai: విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలి

ABN , First Publish Date - 2022-07-31T15:17:20+05:30 IST

ప్రతి విద్యార్థికి సమానమైన, నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌(Telangana Governor Dr.

Governor Tamilisai: విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలి

- స్కూళ్లకు ‘అక్రెడిటేషన్‌’ కోసం కృషి 

- తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై


అడయార్‌(చెన్నై), జూలై 30: ప్రతి విద్యార్థికి సమానమైన, నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌(Telangana Governor Dr. Tamilisai Soundar Rajan) పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్‌ ప్రమోషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఈపీఎస్ఐ), నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డు ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (కానిస్టిట్యూటెంట్‌ బోర్డు ఆఫ్‌ క్వాలిటీ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియా) సంయుక్త ఆధ్వర్యంలో ‘క్వాలిటీ అస్యూరెన్స్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌’ అనే అంశంపై తొలి రీజినల్‌ స్కూల్‌ క్వాలిటీ కాంక్లేవ్‌ శనివారం సాయంత్రం నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ తమిళి సై మాట్లాడుతూ.. దేశంలోని విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించాలని, ఇందుకోసం అన్ని స్థాయిల్లో విద్యా సంస్థలకు అక్రెడిటేషన్‌ ఇవ్వాలని కోరడం సముచితమేనని, ఇందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే, 1.5 లక్షల పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడితో విద్యా బోధన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలికాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధగా ఉందన్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, వారిలోని దురాలోచనను పారద్రోలాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు సమాజంపై ఉందని తమిళిసై సూచించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) ఛాన్స్‌లర్‌, ఈపీఎ్‌సఐ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ అధ్యక్షోపన్యాసంలో జాతీయ విద్యా విధానం(National Education Policy)పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విద్యార్థులకు తొమ్మిదో తరగతి(Ninth class) వరకు ఎలాంటి పరీక్ష లేకుండా ఉత్తీర్ణులను చేయడం విద్యా రంగానికి హాని చేస్తుందన్నారు. మన దేశంలో విద్యా రంగానికి దేశ జీడీపీలో 4 శాతం నిధులు మాత్ర మే కేటాయిస్తున్నారని, ఈ మొత్తాన్ని 6 శాతానికి పెంచాలని జాతీయ విద్యా కమిషన్‌ సూచిందని గుర్తుచేశారు. దేశంలో 26 కోట్ల మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కేవలం 15 లక్షల పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ విద్యార్థులందరికీ ముఖ్యంగా పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆయన కోరారు. స్కూల్స్‌కు అక్రిడిటేషన్‌ ఇవ్వాలని కోరుతూ అవగాహన కల్పించే కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ప్రొ చాన్సెలర్‌ డాక్టర్‌ ఏ.జ్యోతిమురుగన్‌, ఎన్‌బీఈటీ ఛైర్‌పర్సన్‌ పీఆర్‌ మెహతా, ఎన్‌ఏబీఈటీ సీఈవో డాక్టర్‌ మనీష్‌ జిందాల్‌, కోవైకు చెందిన శ్రీకృష్ణ ఇన్‌స్టిట్యూషన్‌ ఛైర్‌పర్సన్‌ ఎస్‌.మలర్‌విళి తదితరులు పాల్గొన్నారు. 

Read more