Governor: ద్రావిడం అంటే తమిళనాడే కాదు...

ABN , First Publish Date - 2022-10-11T13:14:14+05:30 IST

ద్రావిడం అంటే తమిళనాడు మాత్రమేనని అందరూ అపోహపడుతున్నారని, వాస్తవానికి ద్రావిడం అంటే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక,

Governor: ద్రావిడం అంటే తమిళనాడే కాదు...

- ఐదు రాష్ట్రాలు కలిసిన ప్రాంతం 

- గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి


చెన్నై, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ద్రావిడం అంటే తమిళనాడు మాత్రమేనని అందరూ అపోహపడుతున్నారని, వాస్తవానికి ద్రావిడం అంటే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలతో కూడిన ప్రాంతమని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi) వ్యాఖ్యానించారు. సోమవారం రాజ్‌భవన్‌లో ‘ఏక భారతం... సమున్నత భారతం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగ ధర్మాసనం అమలులోకి వచ్చిందని, అప్పటి నుంచే పాలనా పరమైన న్యాయపరమైన హక్కులు అందరికీ లభించాయన్నారు. అందరూ చెబుతున్నట్లు ఆంగ్లేయులు దేశసమైక్యతకు పాటుపడలేదని, 1905లోనే బెంగాల్‌ను విభజించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆ విభజనను వ్యతిరేకిస్తూ తమిళనాట భారతీయార్‌ పోరాడారని, మహాత్మాగాంధీతో కలిసి నేతలంతా ఉద్యమించారని తెలిపారు. భారతదేశం ఎప్పుడూ ఏకచత్రాధిపత్యంలో లేదన్నారు. ప్రాచీన కాలం నుండి దేశ సౌర్వభౌమాధికారం ధర్మంపైనే ఆధారపడి ఉందని, ధర్మమార్గాన్ని అనుసరించకపోవడంతో పాలకులు పతనమవుతూ వచ్చారని వెల్లడించారు. హిమాలయాల నుంచి శ్రీలంక కొస వరకూ విస్తరించినదే అఖండ భారతమని, రాజకీయపార్టీలు ప్రజల మధ్య విభేదాలు సృష్టించడంతో సమైక్యంగా ఉన్న రాష్ట్రాలన్నీ భాషా ప్రాతిపదికన విభజించబడ్డాయన్నారు. అప్పటిదాకా సోదరభావంతో కలిసిమెలసి ఉన్నవాళ్ళంతా ప్రస్తుతం నువ్వా నేనా అంటూ పోట్లాటకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.. అధికారం కోసం రాజకీయ పార్టీలు కుల మతాలు భాషల పేరిట ప్రజల మధ్య చిచ్చు రగలిస్తున్నాయని గవర్నర్‌ విమర్శించారు. జాతీయగీతంలోనే ద్రావిడం అంటే తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఆంధ్ర, కేరళ(Tamil Nadu, Telangana, Karnataka, Andhra, Kerala) రాష్ట్రాలతో కూడినదేనని స్పష్టమవుతోందని, వాస్తవాలు ఇలా ఉండగా ద్రావిడం అంటే ఒక్క తమిళనాడు మాత్రమేనని అపోహపడుతుండటం శోచనీయమన్నారు. ఈ సదస్సులో తొమ్మిది కళాశాలలకు చెందిన 153 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Read more