అమ్మాయిల వివాహ వయసు బిల్లు... పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళా ఎంపీ

ABN , First Publish Date - 2022-01-03T07:37:53+05:30 IST

అమ్మాయిల వివాహ వయసు పెంపు బిల్లును అధ్యయనం చేయడానికి ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో ఒకే ఒక్క మహిళకు స్థానం దక్కింది. మొత్తం 31 మంది పార్లమెంటు సభ్యులున్న కమిటీలో తృణమూల్‌ ...

అమ్మాయిల వివాహ వయసు బిల్లు...  పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళా ఎంపీ

  చర్చనీయాంశంగా స్టాండింగ్‌ కమిటీ కూర్పు

న్యూఢిల్లీ, జనవరి 2: అమ్మాయిల వివాహ వయసు పెంపు బిల్లును అధ్యయనం చేయడానికి ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో ఒకే ఒక్క మహిళకు స్థానం దక్కింది. మొత్తం 31 మంది పార్లమెంటు సభ్యులున్న కమిటీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళా ఎంపీ సుస్మితా దేవ్‌ మాత్రమే సభ్యురాలిగా ఉన్నారు. మహిళల కోసం ఉద్దేశించిన బిల్లును పరిశీలించి సిఫార్సులు చేయడానికి ఏర్పాటుచేసిన కమిటీలో వారికే సరైన ప్రాతినిధ్యం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కమిటీలో మరింత మంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదని టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బిల్లుపై చర్చించడానికి మహిళా ఎంపీలను ఎంపిక చేసే అధికారం కమిటీ చైర్మన్‌కు ఉంటుందని ఎన్సీపీకి చెందిన మహిళా ఎంపీ సుప్రియా సూలె అన్నారు. అమ్మాయిల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్టం కావాలంటే హిందూ, క్రిస్టియన్‌, ముస్లిం తదితర వివాహ చట్టాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును అనేక పార్టీలు, మత సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లును అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని  పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి లోక్‌సభ నివేదించింది.

Updated Date - 2022-01-03T07:37:53+05:30 IST