ఇటలీ ప్రధానిగా జార్జియా మెలొనీ

ABN , First Publish Date - 2022-09-27T07:35:22+05:30 IST

ఇటలీ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానిగా ఫాసిస్టు నేత జార్జియా మెలొనీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

ఇటలీ ప్రధానిగా జార్జియా మెలొనీ

తొలి మహిళా పీఎంగా ఫాసిస్టు భావజాలం ఉన్న నేత


రోమ్‌, సెప్టెంబరు 26: ఇటలీ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానిగా ఫాసిస్టు నేత జార్జియా మెలొనీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి మెజారిటీ ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు అవిభాజ్య ఇటలీలో ముస్సోలినీ ప్రభుత్వం, జర్మనీలో నియంత హిట్లర్‌ ఆధ్వర్యంలో ఫాసిస్టు సర్కారులు రాజ్యమేలాయి. మళ్లీ ఇన్నేళ్లకు యూర్‌పలో ఏర్పడబోయే తొలి ఫాసిస్టు ప్రభుత్వంగా మెలొనీ సర్కారు నిలవబోతోంది. ఈ ఎన్నికల్లో మెలొనీ నేతృత్వంలోని కూటమి సుమారు 44 శాతం ఓట్లు సాధించింది. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి సుమారు 26 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన సెనేట్‌లో ఈ కూటమికి సుమారు 114 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 104 మంది సభ్యులు ఉంటే చాలు. కాగా, మెలొనీ విజయం పట్ల ఐరోపా వ్యాప్తంగా ఉన్న ఫాసిస్టులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, యూరోపియన్‌ యూనియన్‌లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇటలీలో మెలొనీ ప్రధాని కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫాసిస్టు పోకడలు కలిగిన మెలొనీ ప్రధాని కావడం యూర్‌పలో ప్రజాస్వామానికి ముప్పు అనే విమర్శలున్నాయి. ఆమె వైఖరి, గతంలో పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటువంటి విశ్లేషణలకు ఆధారంగా నిలుస్తున్నాయి.   

Updated Date - 2022-09-27T07:35:22+05:30 IST