Gehlot Reverse Gear: అధ్యక్షుడు కాకముందే కాంగ్రెస్‌‌కు షాకిచ్చిన గెహ్లాట్

ABN , First Publish Date - 2022-09-26T03:47:13+05:30 IST

జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధిష్టానానికి షాకిచ్చారు.

Gehlot Reverse Gear: అధ్యక్షుడు కాకముందే కాంగ్రెస్‌‌కు షాకిచ్చిన గెహ్లాట్

జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధిష్టానానికి షాకిచ్చారు. తనకు మద్దతిస్తున్న 92 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. వీరంతా తమ రాజీనామా పత్రాలను స్పీకర్ సీపీ జోషికి అప్పగించారు. 101 మంది ఎమ్మెల్యేలు ఎవరి వెంట ఉంటే వారే సీఎం అవుతారని గెహ్లాట్ సన్నిహితుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ చెప్పారు. 92 మంది ఎమ్మెల్యేలు గెహ్లాట్ సీఎంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారని ప్రతాప్ సింగ్ తెలిపారు. సచిన్ పైలట్ వెంట అతి తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. 





కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. అయితే తాను చక్కదిద్దలేనని, పరిస్థితులు చేయిదాటేశాయని గెహ్లాట్ స్పష్టం చేశారు. 


అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనే తదుపరి కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడని ప్రచారం జరుగుతోంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతానని గెహ్లాట్ సోనియా, రాహుల్‌కు చెప్పగా వారు తిరస్కరించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఫార్ములా ఫాలో కావాలని సూచించారు. అయితే కనీసం స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని గెహ్లాట్ అడిగారు. తన రాజకీయ ప్రత్యర్ధి సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయడానికి వీల్లేదని మోకాలడ్డారు. కేరళ నుంచి జైపూర్ చేరుకోగానే వేగంగా పావులు కదిపారు. తన వర్గం ఎమ్మెల్యేలను తన వైపే ఉండేలా చూసుకున్నారు. తనకు మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేల చేత గెహ్లాట్ రాజీనామా చేయించారు. గెహ్లాట్‌కు మద్దతుగా రాజీనామా చేసిన వారి సంఖ్య వంద దాకా ఉందని తెలుస్తోంది. రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు జైపూర్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రస్తుతం చేతులెత్తేశారు. 


మొత్తానికి ఇంకా అధ్యక్షుడు కాకముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గెహ్లాట్ షాకివ్వడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరనేదానికన్నా రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమే ప్రస్తుతం హైలైట్ అవుతుండటం కొసమెరుపు. 

Updated Date - 2022-09-26T03:47:13+05:30 IST