Gali Janardhan Reddy: గంగావతి నుంచి పోటీ చేస్తా..

ABN , First Publish Date - 2022-12-06T10:47:28+05:30 IST

గంగావతి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) తెలిపారు

Gali Janardhan Reddy: గంగావతి నుంచి పోటీ చేస్తా..

- మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి

గంగావతి రూరల్‌(బెంగళూరు), డిసెంబరు 5 : గంగావతి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) తెలిపారు. సోమవారం గంగావతిలోని అంజనాద్రి ఆలయ అధ్యక్షుడు సంతోష్‌ కాళోజీ నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం తాను గంగావతి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే గంగావతిలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వున్నందున ప్రజల సమస్యలు తెలుసుకుని వారితో మమేకమయ్యేందుకు ఇక్కడే వుండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తన అభిమానులు కూడా గంగావతి(Gangavati) నుంచి పోటీ చేయాలని సూచించారని తెలిపారు. తాను ఇక్కడే సొంత నివాసం ఏర్పరచుకుని, ఇక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా బళ్లారికు గంగావతి దగ్గరగా వున్నందున అక్కడి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేందుకు అవకాశం వుంటుందన్నారు. త్వరలో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటానని తెలిపారు.

Updated Date - 2022-12-06T10:50:34+05:30 IST