Congress Presidential Polls: పోటీపై జీ-23 కాంగ్రెస్ నేతల ప్రకటన

ABN , First Publish Date - 2022-09-30T17:59:57+05:30 IST

కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు

Congress Presidential Polls: పోటీపై జీ-23 కాంగ్రెస్ నేతల ప్రకటన

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలు ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. ఇది అందరూ కలిసికట్టుగా, ఒకరికొకరు మద్దతిచ్చుకోవలసిన సమయమని వారు స్పష్టం చేశారు. దీంతో ఈ పదవికి పోటీలో మిగిలేది మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మాత్రమేనని తెలుస్తోంది. 


పృథ్వీరాజ్ చవాన్, భూపిందర్ హుడా, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటి జీ-23 నేతలు గురువారం సమావేశమై కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై చర్చించారు. వీరు గతంలో సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీలోని అన్ని స్థాయులకు అంతర్గత ఎన్నికలు జరగాలని డిమాండ్ చేసినప్పటికీ, ఇప్పుడు మాత్రం వీరు అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే శశి థరూర్ కూడా ఈ జీ-23 నేతల్లో ఒకరనే విషయం తెలిసిందే. 


మనీష్ తివారీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాను బలి పశువును కాదలచుకోలేదన్నారు. శశి థరూర్ తర్వాత పోటీ చేయబోతున్నది తానేనని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల బరిలో తాను ఉండబోవడం లేదని తివారీ ఓ ట్వీట్ ద్వారా కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ, పార్టీని బలోపేతం చేయవలసిన సమయం ఇది అని చెప్పారు. 


‘‘నాయకత్వం, సైద్ధాంతిక స్పష్టత, వాగ్ధాటి, పారదర్శకంగా వనరులను పొందగలగడం ఓ రాజకీయ పార్టీకి స్తంభాల వంటివి’’ అని తెలిపారు. ఇటీవలి దురదృష్టకర పరిణామాల దృష్ట్యా అరమరికలు లేకుండా, పరస్పర సహకారంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవలసిన సమయం ఇది అని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాటలను గుర్తు చేసుకోవాలన్నారు. ఏకాభిప్రాయం కోసం కృషి చేయాలని, సమర్థవంతమైన అధ్యక్షుని ఎన్నుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ గతంలో చెప్పిన మాటలను ఈ సందర్భంగా మనీష్ తివారీ ఉటంకించారు. 


‘‘కొన్ని పదవులను కోరకూడదు. వాటిని మనకు ఇవ్వాలి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి అలాంటివాటిలో ఒకటి. కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించాలని ఓ ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించి, ఆ తర్వాత వచ్చే వార్షిక సమావేశం వరకు ఆ నేత అధ్యక్ష పదవిని నిర్వహించే పాత సంప్రదాయం చెప్పుకోదగినది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఏకగ్రీవంగా ఎన్నికైన లేదా సామరస్యంగా అంగీకారం కుదిరిన అభ్యర్థిని నిలపడంపైనే నా దృష్టి ఎల్లప్పుడూ ఉండేది’’ అని ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాల్లో చెప్పారని మనీష్ తివారీ పేర్కొన్నారు. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గే శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. దీంతో దిగ్విజయ్ సింగ్ బరి నుంచి తప్పుకున్నారు. ఈ నేతలిద్దరూ శుక్రవారం సమావేశమై, చర్చించిన అనంతరం దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, తాను పోటీ చేయబోవడం లేదని తెలిపారు. 


విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, సోనియా గాంధీ ఈ ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరిస్తానని చెప్తున్నప్పటికీ, మల్లికార్జున ఖర్గేను బరిలో నిలపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆమెకు అత్యంత కీలక సలహాదారు కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని ఖర్గేకు గురువారం రాత్రి తెలియజేశారని సమాచారం. 


2020లో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో ఒకరైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా కూడా ఖర్గేకు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. 


Read more