తొలిసారి ఎమ్మెల్యే బరిలో అఖిలేశ్‌

ABN , First Publish Date - 2022-01-23T07:38:13+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎస్పీకి కంచుకోట అయిన మైన్‌పురీ జిల్లాలోని కర్హాల్‌ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారని ఎస్పీ రాజ్యసభ సభ్యుడు, అఖిలేశ్‌ బాబాయ్‌ రామ్‌గోపాల్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం లఖ్‌నూలో..,

తొలిసారి ఎమ్మెల్యే బరిలో అఖిలేశ్‌

ఎస్పీ కంచుకోట కర్హాల్‌ నుంచి పోటీ

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎస్పీకి కంచుకోట అయిన మైన్‌పురీ జిల్లాలోని కర్హాల్‌ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారని ఎస్పీ రాజ్యసభ సభ్యుడు, అఖిలేశ్‌ బాబాయ్‌ రామ్‌గోపాల్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం లఖ్‌నూలో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 1993 నుంచి ప్రతి ఎన్నికలోనూ కర్హాల్‌లో ఎస్పీయే విజయం సాధించింది. 2002లో మాత్రం ఇక్కడ బీజేపీ గెలిచింది. తిరిగి 2007లో ఎస్పీ ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆ పార్టీ నేత శోభారన్‌ యాదవ్‌ ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌నాథ్‌ నుంచి పోటీ చేయించాలని బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కర్హాల్‌ నుంచి పోటీ చేయాలని అఖిలేశ్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐటీ రంగంలో యువతకు 22 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అఖిలేశ్‌ అన్నారు. లఖ్‌నవూలో మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

Updated Date - 2022-01-23T07:38:13+05:30 IST