Vote: దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు!

ABN , First Publish Date - 2022-12-30T01:23:26+05:30 IST

ఎన్నికల సమయంలో ఎంత ప్రచారం చేసినా, ఎన్ని విధానాలు అమలుచేసినా దేశంలో ఓటింగ్‌ శాతం మాత్రం అంతంతమాత్రంగానే నమోదవుతోంది.

 Vote: దేశంలో ఎక్కడి నుంచైనా   ఓటు!

సొంతూరెళ్లకుండానే వేసే చాన్స్‌

వలస ఓటర్ల కోసం ‘రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌’

నమూనా ఆర్‌వీఎం రూపొందించిన ఈసీ

16న డెమో.. రాజకీయ పార్టీలకు ఆహ్వానం

న్యూఢిల్లీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఎంత ప్రచారం చేసినా, ఎన్ని విధానాలు అమలుచేసినా దేశంలో ఓటింగ్‌ శాతం మాత్రం అంతంతమాత్రంగానే నమోదవుతోంది. ముఖ్యంగా ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారిలో చాలామంది ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. ఇలా దేశంలో దాదాపు మూడో వంతు మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ముందడుగు వేసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారు తాము ఎక్కడుంటే అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేలా రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఆర్‌వీఎం)ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఒకే పోలింగ్‌ బూత్‌నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కుని వినియోగించుకునేలా ఒక నమూనా (ప్రొటోటైప్‌) రిమోట్‌ ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఈవీఎం)ను అభివృద్ధి చేసింది. దీని పనితీరును ప్రదర్శించేందుకు జనవరి 16న దేశంలోని 8 జాతీయ, 57 రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించింది. రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ను అమల్లోకి తీసుకొచ్చే ముందు ఎదురయ్యే చట్టపరమైన, పరిపాలన, సాంకేతిక పరమైన సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని, దీనికోసం రాజకీయ పార్టీల అభిప్రాయం కోరనున్నామని ఈసీ వెల్లడించింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, దాదాపు 30 కోట్ల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టగానే ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించారని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. కమిషన్‌ రూపొందించిన ఈవీఎం అందుబాటులోకొస్తే ఏ ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తన స్వస్థలానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని ఈసీ వర్గాలు వెల్లడించాయి.

ఆర్‌వీఎం ద్వారా ఓటింగ్‌ ఎలా..

వేరొక ఊరికి లేదా రాష్ట్రానికి వలస వెళ్లిన ఓటరు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తనకు తన సొంత నియోజకవర్గంలో రిమోట్‌ ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి.

ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని వెరిఫికేషన్‌ పూర్తిచేసిన తర్వాత ఆ వ్యక్తిని రిమోట్‌ ఓటరుగా గుర్తిస్తారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఉంటున్న ప్రాంతంలో రిమోట్‌ ఓటింగ్‌ బూత్‌ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.

ఆర్‌వీఎం ఎలా పనిచేస్తుందంటే..

రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌లో కూడా ఈవీఎంలోని అంశాలే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఈవీఎంలకు ఇది సవరించిన వెర్షన్‌.

ఒక రిమోట్‌ పోలింగ్‌ బూత్‌ నుంచి 72 నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఓటు హక్కు కల్పించవచ్చు.

ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న ఓటరుని పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తి నియోజకవర్గాన్ని సీసీఆర్‌ (కాన్సిస్టెన్సీ కార్డ్‌ రీడర్‌) ద్వారా స్కాన్‌ చేస్తారు.

ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్‌ షీట్‌ డిస్‌ప్లే అవుతుంది.

ఈ బ్యాలెట్‌ షీట్‌ అనేది ఆయా ఓటరును బట్టి, ఓటు వేసే నియోజకవర్గాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

రిమోట్‌ ఓటరు ఆ బ్యాలెట్‌ షీట్‌లో ఉన్న అభ్యర్థి ఎదురుగా ఉన్న బటన్‌ నొక్కి ఓటు వేయాలి.

ఆ తర్వాత స్టేట్‌ కోడ్‌, నియోజకవర్గ నంబర్‌, అభ్యర్థి నంబర్‌ వివరాలతో ఆ ఓటు రిమోట్‌ కంట్రోల్‌ యూనిట్‌ (ఆర్‌సీయూ)లో రికార్డవుతుంది.

అనంతరం అభ్యర్థి ఓటు పూర్తయినట్టు వివరాలతో కూడిన వీవీప్యాట్‌ స్లిప్‌ బయటకు వస్తుంది.

కౌంటింగ్‌ సమయంలో ఆర్‌సీయూలో నమోదైన ఓట్లలో ఏ నియోజకవర్గంలో, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే వివరాలు వెల్లడిస్తారు.

ఇదొక గొప్ప ముందడుగు: ఖురేషీ

వలస ఓటర్ల కోసం రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ను తీసుకురావాలన్న నిర్ణయాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ స్వాగతించారు. ‘ఎన్నికల కమిషన్‌ ప్రకటన చూశాను. ఇదొక గొప్ప ముందడుగుగా భావిస్తున్నాను. ఎందుకంటే వలస ఓటర్ల సమస్య చాలాకాలంగా ఉంది. దీనికి మేం పరిష్కారం కనుగొనలేకపోయాం. ఒకవేళ ఇప్పుడు పరిష్కారం లభిస్తే చాలా మంచి జరుగుతుంది. దీని నమూనాను పరిశీలించేందుకు ఈసీ రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఇది చాలా మంచి విషయం’ అని ఖురేషి అన్నారు.

వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది: కాంగ్రెస్‌

వలస కార్మికుల కోసం తీసుకొచ్చిన రిమోట్‌ ఓటింగ్‌ ప్రతిపాదనను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది. ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టే ముందు.. ఈవీఎంల దుర్వినియోగంపై ప్రతిపక్షాల భయాన్ని తొలగించాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ దీనిపై స్పందిస్తూ.. ఇటీవల గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను గుర్తుచేశారు. ‘ఈ నమూనా ఓటింగ్‌ యంత్రం ద్వారా అక్రమాలను బహుళ నియోజకవర్గాలకు ఎలా విస్తరించవచ్చో ఊహించుకోండి. ఇది వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలని మేం ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం’ అని జైరాం అన్నారు.

Updated Date - 2022-12-30T01:23:27+05:30 IST