‘మనీలాండరింగ్‌’ తీర్పుపై నాది భిన్నాభిప్రాయం

ABN , First Publish Date - 2022-08-17T06:47:16+05:30 IST

మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కఠినమైన నిబంధనలు సరైనవేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తనకు భిన్నాభిప్రాయాలున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు..

‘మనీలాండరింగ్‌’ తీర్పుపై నాది భిన్నాభిప్రాయం

ఆ చట్టంలోని ఓ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధం

చేసిన తప్పేమిటో చెప్పాల్సిన బాధ్యత ఈడీదే

మాజీ జడ్జి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు వ్యాఖ్యలు 


న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కఠినమైన నిబంధనలు సరైనవేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తనకు భిన్నాభిప్రాయాలున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లీఫ్‌ లెట్‌ అనే సంస్థ జీవితం- స్వేచ్ఛ అన్న అంశంపై నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. మనీలాండరింగ్‌ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులు, మాజీ న్యాయమూర్తులు చేసిన  వ్యాఖ్యలను తాను చదివానన్నారు. ఒకవేళ తానే తీర్పు ఇచ్చి ఉంటే వేరే వైఖరిని తీసుకునేవాడినని తెలిపారు. మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 45 రాజ్యాంగంలోని 14, 21వ అధికరణాలను ఉల్లంఘిస్తుందని గతంలో నికేష్‌ షా కేసులో సుప్రీంకోర్టు మరో రకమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


ఈడీ చెప్పాల్సిందే 

నేర న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం ప్రకారం ఒక నేరారోపణకు గురైన వ్యక్తికి అతడు ఏమి నేరం చేశాడో చెప్పాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ నాగేశ్వరరావు అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తమను ఎందుకు పిలిచిందో తెలియని పరిస్థితి ఉండడం సరైన విధానం కాదని అన్నారు. కేసు నమోదుకు సంబంధించిన ఈసీఐఆర్‌ పత్రాలను ఈడీ ఇవ్వకపోతే బెయిల్‌కు దరఖాస్తు చేసుకునేవారు తమనెలా సమర్థించుకోగలుగుతారని ఆయన ప్రశ్నించారు. అందువల్ల మనీలాండరింగ్‌ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగత స్వేచ్చకు విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయం ఏర్పడిందని తెలిపారు. 


జైల్లో వేసేయాలన్న మనస్తత్వం సరికాదు

బెయిల్‌ అనేది నిబంధన, జెయిల్‌ అనేది మినహాయింపు అన్నదానిపై జస్టిస్‌ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. దేశ ంలో 2010-2021 మఽధ్య 13వేల రాజద్రోహం కేసులు మోపారని, అందులో 126 మందిపైనే విచారణ పూర్తయిందని చెప్పారు. కేవలం 13 మందికి మాత్రమే శిక్షపడిందని తెలిపారు,  దేశంలో జైళ్లన్నీ విచారణ దశలో ఉన్న ఖైదీలతోనే  కిక్కిరిసిపోతున్నాయని, చాలామందిని అరెస్టు చేయనవసరమే లేదని కోర్టు ఒక దశలో అభిప్రాయపడిందని చెప్పారు. జైళ్లో వేసి తీరాల్సిందేనన్న దర్యాప్తు సంస్థల మనస్తత్వం వలస కాలం నాటి లక్షణమని అభిప్రాయపడ్డారు. నేర విచారణ దశే ఒక శిక్షగా మారిందని చెప్పారు. జర్నలిస్టులు అర్నాబ్‌ గోస్వామి, మహమ్మద్‌ జుబైర్‌ లకు బెయిల్‌ ఇచ్చి వ్యక్తిగత స్వేచ్చను కాపాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


సిబల్‌ వ్యాఖ్యలు సరికాదు

సుప్రీంకోర్టుపై తాను విశ్వాసం కోల్పోతున్నానంటూ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలతో తాను ఏకీభవించలేనని జస్టిస్‌ నాగేశ్వరరావు చెప్పారు. కేవలం కొన్ని తీర్పులు తమకు ఇష్టం లేనందువల్ల గత 75 ఏళ్లుగా మనుగడలోఉన్న ఒక సంస్థపై నమ్మకం కోల్పోరాదని ఆయన చెప్పారు. ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కును అనుభవించే అవకాశం ఎందరికో కలిగించిందని తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిందని చెప్పారు. కోర్టుల జోక్యం వల్లనే కూడు, గూడు విద్య వంటి సమస్యలకు పరిష్కారం లభించిన సందర్భాలున్నాయని ఆయన వివరించారు. 

Read more