కూతురి కోసం.. అమ్మ రోబో

ABN , First Publish Date - 2022-09-26T07:52:14+05:30 IST

అతడో రోజుకూలీ. ఎటువంటి డిగ్రీలు, చదువులూ లేని ఒక సాదాసీదా వ్యక్తి. కానీ తన బిడ్డపై ప్రేమ అతడిని ఒక రోబోను కనిపెట్టేలా చేసింది.

కూతురి కోసం.. అమ్మ రోబో

గోవాలో రోజు కూలీ అద్భుత సృష్టి!


పణజి, సెప్టెంబరు 25: అతడో రోజుకూలీ. ఎటువంటి డిగ్రీలు, చదువులూ లేని ఒక సాదాసీదా వ్యక్తి. కానీ తన బిడ్డపై ప్రేమ అతడిని ఒక రోబోను కనిపెట్టేలా చేసింది. గోవాకు చెందిన బిపిన్‌ కదమ్‌దీ కథ. కన్నప్రేమ ఎలాంటి అద్భుతాలను చేయించగలదో నిరూపించే ప్రత్యక్ష ఉదాహరణ. దక్షిణ గోవాలోని పోండా తాలూకా బెతోరా గ్రామానికి చెందిన బిపిన్‌(40)కు భార్య, కుమార్తె ఉన్నారు. అతడి 14ఏళ్ల కుమార్తె దివ్యాంగురాలు. ఎవరైనా తినిపిస్తే తప్ప తినలేని పరిస్థితి. మరోవైపు బిపిన్‌ భార్య అనార్యోగంతో రెండేళ్ల క్రితం మంచం పట్టింది. దీంతో రోజూ

కూలిపనికి వెళ్లి, మధ్యలో వచ్చి తన బిడ్డకు అన్నం తినిపించి తిరిగి పనికి వెళ్లేవాడు బిపిన్‌. కానీ.. బిడ్డ ఎవరిమీదా ఆధారపడకుండా తినేలా ఏదైనా ఏర్పాటు చేయాలని అతడి భార్య పదే పదే బిపిన్‌ను కోరడంతో అతడు ఆలోచనలో పడ్డాడు.


ఈ క్రమంలోనే.. ఆహారం అందించే ఒక రోబోను రూపొందించాలన్న ఆలోచనకు వచ్చాడు. అందుకోసం సుమారు ఏడాది పాటు కష్టించాడు. ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి కనీస అంశాలపై అవగాహన పెంచుకున్నాడు. ఓవైపు 12గంటల పాటు నిరంతరం కూలి పని, ఇంటికి రాగానే రోబో గురించిన పరిశోధన. ఇలా రేయింబవళ్లు సాగిన అతడి కృషి ఎట్టకేలకు ఫలించింది. తన కుమార్తెకు ఆహారం అందించగల రోబోను బిపిన్‌ తయారుచేయగలిగాడు. దానికి ‘అమ్మ రోబో’ అని పేరు పెట్టాడు. కూతురి మాట వినపడగానే రోబో ఆమె దగ్గరికి వచ్చి ఆహారాన్ని అందిస్తుందని బిపిన్‌ కదమ్‌ తెలిపాడు. బాలిక తానేం తినాలనుకుంటున్నానో చెబితే.. అదే పదార్థాన్ని బాలిక నోటికి రోబో తినిపిస్తుందని పేర్కొన్నాడు.  ‘‘ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్‌ గురించి తరచూ చెబుతుంటారు. 


అదే తరహాలో నేను కూడా ఎవరి మీదా ఆధారపడకుండా రోబోను అభివృద్ధి చేసుకున్నాను. మున్ముందు ఇలాంటి మరిన్ని రోబోలను తయారుచేసి, నా బిడ్డలాంటి చిన్నారులకు అందిస్తాను. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ చూపించాలనుకుంటున్నాను’’ అని బిపిన్‌ తెలిపాడు. కాగా.. బిపిన్‌ సాధించిన ఘనతకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవా రాష్ట్ర ఆవిష్కరణల మండలి అతడు తన రోబోను మరింతగా ఆధునికీకరించేందుకు అవసరమైన నిధులను అందిస్తోంది. మున్ముందు దీన్ని వాణిజ్యపరంగా తయారీ మొదలుపెట్టేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా రూపొందిస్తోంది. తద్వారా ఎంతోమంది దివ్యాంగ చిన్నారులకు సమయానికి ఆహారాన్ని అందించేందుకు అవకాశం ఉంటుందని మండలి ప్రాజెక్టు డైరెక్టర్‌ సుదీప్‌ ఫల్‌దేశాయ్‌ తెలిపారు. 

Updated Date - 2022-09-26T07:52:14+05:30 IST