పాకిస్థాన్‌లో వరద.. 1,300 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2022-08-31T08:43:26+05:30 IST

దాయాదీ దేశం పాకిస్థాన్‌ వరదలతో అల్లకల్లోలమవుతోంది. వరద బీభత్సానికి ఇప్పటి వరకు 1,300 మంది మరణించినట్లు అధికారిక వర్గాల

పాకిస్థాన్‌లో వరద.. 1,300 మంది దుర్మరణం

భారత్‌ నుంచి రోడ్డుమార్గం పునరుద్ధరణ


ఇస్లామాబాద్‌, ఆగస్టు 30: దాయాదీ దేశం పాకిస్థాన్‌ వరదలతో అల్లకల్లోలమవుతోంది. వరద బీభత్సానికి ఇప్పటి వరకు 1,300 మంది మరణించినట్లు అధికారిక వర్గాల అంచనా. దేశ జనాభాలో 15ు.. అంటే.. సుమారు 3 కోట్ల మంది నిర్వాసితులయ్యారు. ఇళ్లు, భవనాలు, గోదాములు, రహదారులు, వంతెనలు.. ఇలా వనరులన్నీ వరద తాకిడికి పేకమేడల్లా కూలిపోయాయి. చేతికందిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సుడులు తిరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ఇంకా తగ్గుముఖం పట్టలేదు. రూ. 79,500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ వరదలను జాతీయ విపత్తుగా పాకిస్థాన్‌ సర్కారు ప్రకటించింది.


ఇప్పటికే ఆర్థికమాంద్యం వైపు వేగంగా దూసుకెళ్తున్న పాకిస్థాన్‌ పరిస్థితి తాజా వరదలతో మరింత దారుణంగా తయారవుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయి. ముఖ్యంగా అమెరికా డాలర్‌ నిల్వలు నిండుకుంటున్నాయి. సోమవారం భేటీ అయిన ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌(ఐఎంఎఫ్‌) కూడా పాకిస్థాన్‌కు రూ.47 వేల కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది. తాజా వరదలు పాక్‌ వ్యాప్తంగా ప్రభావం చూపినా.. ముఖ్యంగా కైబర్‌ పంఖ్తుఖ్వా, పంజాబ్‌, బలూచిస్థాన్‌, సింధ్‌ ప్రావిన్సులను ముంచెత్తింది. ఈ ప్రావిన్సుల్లోని 66 జిల్లాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకాలేర్పడుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం.. ఉన్న రహదారులన్నీ నదులు, చెరువులను తలపిస్తుండడంతో.. రోడ్డు మార్గంలో సహాయక చర్యలు కుదరడం లేదని అధికారులు తెలిపారు. పడవల్లో తరలిస్తున్న వరదబాధితులు పలు చోట్ల ప్రమాదాల బారిన పడ్డారు. సెహ్వాల్‌లోని బిలావర్‌పూర్‌ గ్రామంలో 25 మంది వరద బాధితులను తరలిస్తున్న పడవ బోల్తాకొట్టడంతో 13 మంది మృతిచెందారు.


వరద కారణంగా పంటలు దెబ్బతినడం.. రవాణా సదుపాయాలు లేకపోవడంతో చాలా ప్రావిన్సుల్లో నిత్యావసరాలు చుక్కలను తాకుతున్నాయి. కూరగాయలకు తీవ్ర కొరత నెలకొంది. దీంతో.. భారత్‌ నుంచి కూరగాయల దిగుమతికి పాక్‌ సర్కారు సిద్ధమైంది. కశ్మీరుకు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ 370 నిర్వీర్యం తర్వాత.. భారత్‌ నుంచి దిగుమతులను పాకిస్థాన్‌ నిలిపివేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా భారత్‌తో రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌ వరదల మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. సాయం కోసం పాకిస్థాన్‌ సర్కారు భారత్‌తో చర్చించినట్లు తెలిసింది.

Read more