మారియుపోల్‌లో భయం.. భయం!

ABN , First Publish Date - 2022-04-24T07:58:37+05:30 IST

ఉక్రెయిన్‌లో.. అజోవ్‌ సముద్రతీర నగరం మారియుపోల్‌లో పౌరులు క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు.

మారియుపోల్‌లో భయం.. భయం!

చిన్నారుల షెల్టర్‌ ప్లాంట్‌పై రష్యా దాడులు

అదే జరిగితే రష్యాతో చర్చలుండవు: జెలెన్‌స్కీ

కీవ్‌/న్యూయార్క్‌, ఏప్రిల్‌ 23: ఉక్రెయిన్‌లో.. అజోవ్‌ సముద్రతీర నగరం మారియుపోల్‌లో పౌరులు క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణను ప్రారంభించిన రష్యా తొలినాళ్లలోనే మారియుపోల్‌ పోర్టును స్వాధీనం చేసుకోగా.. ఆదివారాల్లో తెల్లవారుజాము నుంచే విధ్వంసాలకు పాల్పడింది. 4.30 లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరంలో.. ఇప్పటికీ లక్ష మందికిపైగా పౌరులు చిక్కుకున్నారని ఉక్రెయిన్‌ సైనికవర్గాలు చెబుతున్నాయి. ఈ నగరంలో జరగనంతగా ఇక్కడ 20 వేల మంది దాకా పౌరులు యుద్ధానికి బలైనట్లు తెలిపాయి ఐరోపాలోనే అతి పెద్దదైన అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను రష్యా ప్రస్తుతం లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నాయి. ఈ ప్లాంట్‌ భూగర్భంలోని మూడో అంతస్తులో ఉన్న బంకర్‌లో వందల మంది చిన్నారులు తలదాచుకున్నారని వివరించాయి. ‘‘స్టీల్‌ ప్లాంట్‌ బంకర్లలోనే చిన్నారులున్నారు. ఇక్కడ రష్యా దాడులు జరిపితే తీవ్ర ప్రాణనష్టం ఉంటుంది. ప్రపంచదేశాలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, రష్యాను నిలువరించాలి’’ అని ఉక్రెయిన్‌ ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఇక.. ఈ నగరంలో మరో భారీ సామూహిక ఖననాలు వెలుగులోకి వచ్చాయని ప్లానెట్‌ ల్యాబ్స్‌ విడుదల చేసిన ఓ ఉపగ్రహ చిత్రం స్పష్టం చేస్తోంది. వైనోహ్రద్నేలో 148 అడుగుల పొడవు, 82 అడుగుల వెడల్పులో వందల మందిని సామూహికంగా ఖననం చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. లుహాన్స్‌, డోనెట్స్క్‌ల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల చుట్టూ రష్యా దళాలు మోహరించాయని.. ఆదివారం భారీ దాడులకు కుట్రలు జరుగుతున్నాయని ఉక్రెయిన్‌ నిఘా సంస్థ హెచ్చరించింది. లిబియా, సిరియాకు చెందిన లక్ష మంది కిరాయి సైనికులను ఇందుకు వినియోగిస్తోందని వెల్లడించింది. కాగా.. ఒడెసాలో శనివారం రాత్రి జరిగిన క్షిపణి దాడుల్లో ఆరుగురు చనిపోయారు. లుహాన్స్‌ రీజియన్‌లో నాలుగు మరణాలు నమోదయ్యాయి.


ఆ నరహంతకుల్లో చాలా మంది హతం?

పక్షం రోజుల క్రితం బుచాలో రష్యా దురాఘతాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. పౌరుల చేతుల్ని వెనక్కి విరిచికట్టి.. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చి చంపారు. అలా చనిపోయిన 900 మంది దాకా పౌరులను వేర్వేరు ప్రాంతాల్లో సామూహికంగా ఖననం చేశారు. ఈ దారుణానికి రష్యా 64వ సపరేట్‌ మోటారైజ్డ్‌ రైఫిల్‌ బ్రిగేడ్‌ కారణం. ఆ బ్రిగేడ్‌ లుహాన్స్‌ రీజియన్‌ ఇజియంలో తిష్ట వేసిందని.. తమ దళాలు శనివారం ఆ బెటాలియన్‌పై దాడి చేశాయని ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. మరణాల సంఖ్య తెలియాల్సి ఉందని పేర్కొంది. ఖెర్సోన్‌లో ఇద్దరు రష్యా జనరల్స్‌ను హతమార్చినట్లు ఉక్రెయిన్‌ సేనలు ప్రకటించింది. అటు ఉక్రెయిన్‌ ప్రధాని నేతృత్వంలోని బృందం అమెరికా పర్యటనలో ఉంది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ అమెరికాను కోరింది.


ఈ వారంలో ఐరాస చీఫ్‌ పర్యటన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌ అధినేత వోలోదిమిర్‌ జెలెన్‌స్కీలతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనీ గుటెర్రెస్‌ ఈ వారంలో భేటీ కానున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతిని నెలకొల్పాలని ఇరు దేశాధినేతలను కోరనున్నారు.


చైనాపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు

రష్యాతో సంబంధాల నేపథ్యంలో చైనాపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌పై దురాక్రమణను చైనా ఖండించలేదని అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి వెండీ షెర్మాన్‌ మండిపడ్డారు. ‘‘రష్యాతో తమది అపరిమిత స్నేహమని చైనా పేర్కొంది. ఆ దేశం తన వైఖరిని మార్చుకోవాలి’’ అని అన్నారు.

అలా అయితే.. చర్చలుండవు

మారియుపోల్‌లో రష్యా దాడులతో ఇకపై పౌరులు మరణించినా.. ఖెర్సోన్‌ను ప్రత్యేక దేశంగా రష్యా ప్రకటించాలని చూసినా.. చర్చలు ఉండబోవని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఖెర్సోన్‌ ప్రకటనకు రష్యా సిద్ధమవుతుందని.. ‘సూడో రిఫరెండమ్‌’లకు రష్యా స్వస్తి హితవు పలికారు.


రష్యా సర్మత్‌ 

అణు క్షిపణుల మోహరింపు

మాస్కో, ఏప్రిల్‌ 23: రష్యా తన చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణి ‘సమ్రత్‌’ మోహరింపును ప్రారంభించింది. మాస్కోకు 3వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాలోని క్రాస్నోయార్స్క్‌ ప్రాంతానికి క్షిపణులను తరలిస్తోంది. గంటకు 25 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి.. భూమ్మీద ఏ ప్రాంతాన్నైనా తాకగలదు. 16 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు. 10కి పైగా అణు వార్‌ హెడ్లను మోసుకెళ్లగలదు. తమపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలే టార్గెట్‌గా రష్యా క్రాస్నోయార్స్క్‌లో అణు క్షిపణులను మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష కేంద్రం రోస్కాస్మోస్‌ అధికారికంగా ధ్రువీకరించింది.


Read more