పార్టీ నాశనానికి Stalin కుట్ర

ABN , First Publish Date - 2022-07-16T12:57:47+05:30 IST

అన్నాడీఎంకే ద్రోహులతో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేతులు కలిపి తమ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ

పార్టీ నాశనానికి Stalin కుట్ర

- సేలంలో ఈపీఎస్‌ ధ్వజం 

- ఎడప్పాడికి దారి పొడవునా అన్నాడీఎంకే శ్రేణులు ఘన స్వాగతం


చెన్నై, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే ద్రోహులతో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేతులు కలిపి తమ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధ్వజమెత్తారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో శుక్రవారం ఉదయం తస స్వస్థలమైన సేలం నగరానికి చేరుకున్న ఈపీఎస్‏కు పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మార్గమధ్యంలో కళ్లకుర్చి జిల్లా ఉళుందూరుపేట వద్ద తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలనుద్దేశించి ఈపీఎస్‌ ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కంటికి రెప్పలా కాపాడిన అన్నాడీఎంకేను ప్రస్తుతం ద్రోహులంతా కలిసి నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కొంతమంది కుట్రపూరిత చర్యల కారణంగానే అధికారంలోకి రాలేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ పార్టీ ద్రోహులతో చేతులు కలిపి అన్నాడీఎంకేను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే పార్టీ ప్రధాన కార్యాలయానికి సీలు వేయించారని ఆరోపించారు. ఈ సంఘటనతో పార్టీ శ్రేణులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పోలీసులు కూడా ద్రోహులకే అండగా నిలిచిందన్నారు. సీలువేసిన అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వ్యక్తిగత ఆస్తి కాదని, కోటానుకోట్లమంది కార్యకర్తల ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయానికి సీలువేయించిన ద్రోహులకు పార్టీ కార్యకర్తలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్‌ పార్టీని నాశనం చేయాలని కలలు గంటున్నారని, ఆ ప్రయత్నాలేవీ ఫలించవన్నారు. పార్టీకి ద్రోహం చేసినవారందరినీ బహిష్కరించామని, కార్యకర్తలంతా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపు నిచ్చారు. ఆ తర్వాత తన స్వస్థలమైన ఎడప్పాడికి వెళుతూ తలైవాసల్‌ బస్టాండు వద్ద కూడా ఈపీఎస్‌ కార్యకర్తలనుద్దేశించారు. డీఎంకేలో ఎప్పుడూ వారసత్వ రాజకీయాలే కొనసాగుతాయని విమర్శించారు. ఇదిలా వుండగా ఈపీఎస్‌ సేలం వెళుతూ తాంబరంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read more