Former Chief Minister: ఆదరణ లేక ఆపసోపాలు

ABN , First Publish Date - 2022-08-30T13:13:54+05:30 IST

పార్టీలో ఏమాత్రం ఆదరణ లేని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) కేవలం పదవీ వ్యామోహంతో పార్టీని చేజిక్కించుకునేందుకు కుట్ర

Former Chief Minister: ఆదరణ లేక ఆపసోపాలు

- పదవీ వ్యామోహం లేకుంటే పార్టీ ఆఫీసులోకి ఎందుకు చొరబడ్డారు?

- ఓపీఎస్‏పై ఈపీఎస్‌ ధ్వజం


చెన్నై, ఆగస్టు (ఆంధ్రజ్యోతి): పార్టీలో ఏమాత్రం ఆదరణ లేని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) కేవలం పదవీ వ్యామోహంతో పార్టీని చేజిక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధ్వజమెత్తారు. పదవీ వ్యామోహం లేకుంటే అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోకి జొరబడి ఎందుకు హింసాకాండకు పాల్పడారని నిలదీశారు. సోమవారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయం(Trichy Airport)లో ఈపీఎస్‌ విలేఖరులతో మాట్లాడుతూ అందరూ కలసి రావాలని ఓపీఎస్‌ పిలుపునివ్వడం వింతగా ఉందన్నారు. పార్టీకి సంబంధించినంతవరకూ సర్వసభ్యమండలి సభ్యులే కాకుండా సాధారణ కార్యకర్తలంతా తన నాయకత్వానికే మద్దతిస్తున్నారనే విషయం జగమెరిగిన సత్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శాసనసభ్యులు, సర్వసభ్యమండలి సభ్యుల, కోటిన్నర మంది కార్యకర్తలు తన వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఓపీఎస్‌ తన వెంటే కోట్లాదిమంది కార్యకర్తలున్నారని చెప్పడం అసత్యమనే విషయం అందరికీ తెలుసన్నారు. ఓపీఎస్‌ మాయమాటలతో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆరుకుట్టి వెళ్ళారని, ఇకపై తన వర్గంలోని ఎవరూ వెళ్లే అవకాశం లేదన్నారు. డీఎంకే ప్రభుత్వం గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలను పెండింగ్‌లో ఉంచడం గర్హనీయమన్నారు. అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో ప్రారంభించిన కావేరి -గుండారు పథకాన్ని డీఎంకే ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ నివేదికపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తన జిల్లాల పర్యటనకు కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే  ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈపీఎస్‌ హర్షం వెల్లడించారు.

Updated Date - 2022-08-30T13:13:54+05:30 IST