GSAT-24 విజయవంతం.. ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగం.. శాటిలైట్ ప్రయోజనాలు ఇవే..

ABN , First Publish Date - 2022-06-23T20:20:51+05:30 IST

దేశీయ డీటీహెచ్(DTH) అవసరాల కోసం ఇస్రో(ISRO) ప్రత్యేకంగా రూపొందించిన జీశాట్‌-24(GSAT-24) ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ కంపెనీ ‘ఏరియన్‌స్పేస్(

GSAT-24 విజయవంతం.. ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగం.. శాటిలైట్ ప్రయోజనాలు ఇవే..

కౌరు, ఫ్రెంచ్ : దేశీయ డీటీహెచ్(DTH) అవసరాల కోసం ఇస్రో(ISRO) ప్రత్యేకంగా రూపొందించిన జీశాట్‌-24(GSAT-24) ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ కంపెనీ ‘ఏరియన్‌స్పేస్(Arianespace ) కౌరు(Kourou)లోని ఫ్రెంచ్ గయానా(French Guiana) అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్-24ని నింగిలోకి పంపింది. ఏరియన్-5 రాకెట్ ద్వారా శాటిలైట్‌ను భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టింది. తమ వాహకనౌక ద్వారా రెండవ ప్యాసింజర్ అయిన జీశాట్-24 విజయంతంగా వేరు చేయబడిందని, ఈ మేరకు సిగ్నల్స్ కూడా అందాయని ఏరియన్‌స్పేస్ ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. తమపై నమ్మకం ఉంచిన ఎన్‌ఎస్ఐఎల్-ఇండియా(NSIL-India)కు ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌కు చెందిన  ఎంఈఏఎస్‌ఏటీ-3డీ(MEASAT-3d), ఒక మల్టీ-మిషన్ కమ్యూనికేషన్స్ శాటిలైట్‌లను కూడా ప్రయోగించినట్టు పేర్కొంది. ఫ్రెంచ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6:50 గంటల సమయంలో లాంచింగ్ జరిగింది. గయానా స్పేస్ సెంటర్‌ నుంచి ఇది 113వ ప్రయోగం. 


జీశాట్-24 ప్రత్యేకతలు.. ఉపయోగాలు..

GSAT-24 అనేది ఒక కమ్యూనికేషన్స్ శాటిలైట్. ఉపగ్రహం బరువు 4180 కేజీలు. దీని ద్వారా దేశవ్యాప్తంగా డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చవచ్చు. ఏసియా-పసిఫిక్ ప్రాంతంలో బ్రాడ్ బ్యాండ్ కవరేజీని విస్తృత పరచవచ్చు. హై-క్వాలిటీతో టెలివిజన్(TV), టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్‌బ్యాండింగ్ సర్వీసులు అందించవచ్చు. భారతీయ డీటీహెచ్ కస్టమర్ల అవసరాలను దీనిద్వారా తీర్చవచ్చు. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్‌ఎస్ఐఎల్(New Space India Limited) కోసం ఇస్రో(Indian Space Research Organisation) ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. డిమాండ్-డ్రైవ్ తరహాలో ఇస్రో(ISRO) సిద్ధం చేసిన తొలి ఉపగ్రహం ఇదే. జీశాట్-24 శాటిలైట్‌కి అవసరమైన నిధులను ఎన్‌ఎస్‌ఐఎల్(NSIL) సమకూర్చింది. దీంతో ఈ ఉపగ్రహాన్ని ఎన్‌ఎస్‌ఐఎల్ ఆపరేటింగ్‌ చేయనుంది. కాగా శాటిలైట్ టీవీ కంపెనీ ‘టాటా ప్లే(TATA PLAY)’ని  ఎన్‌ఎస్ఐఎల్ లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే.


ఒకే స్పెక్ట్రంతో ఎక్కువ డీటీహెచ్ చానల్స్..

 ఎన్ఎస్ఐఎల్ తెలిపిన వివరాల ప్రకారం.. జీశాట్-24 కార్యకలాపలు మొదలైతే ఒకే స్పెక్ట్రంలో మరిన్ని డీటీహెచ్ చానల్స్‌ను కస్టమర్లకు అందించవచ్చు. అడిషనల్ రెయిన్ ఫేడ్ మార్జిన్‌తో హెచ్‌డీ చానల్స్ వ్యవస్థను మరింత బలోపేతమవుతుందని వివరించింది. ఉపగ్రహ - ఆధారిత ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ సర్వీసుల ద్వారా క్లాస్ రూం కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని వెల్లడించింది. ఈ శాటిలైట్‌లో టెలికమ్యూనికేషన్స్, పురోగతి సాధిస్తున్న డిజిటల్ సినిమా, హైస్పీడ్ లింక్స్, బల్క్ డేటా ట్రాన్స్ఫర్‌కు సంబంధించిన అప్లికేషన్లు కూడా మెరుగుపడాయని వివరించింది.

Read more