ఉభయుల ఆస్తిపైనా.. భార్యాభర్తలకు సమాన వాటా!

ABN , First Publish Date - 2022-08-01T08:01:50+05:30 IST

దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌-యూసీసీ) అమలు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

ఉభయుల ఆస్తిపైనా.. భార్యాభర్తలకు సమాన వాటా!

ముస్లింలకు బహుభార్యత్వం నిషేధం

హిందువులకు మాత్రం మినహాయింపు

గోవా ఉమ్మడి సివిల్‌ కోడ్‌ తీరు

తాజాగా పార్లమెంటరీ కమిటీ అధ్యయనం


న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌-యూసీసీ) అమలు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. కేంద్రం కూడా జాతీయ లా కమిషన్‌ను దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కోరింది. ఇప్పటికే మన దేశంలో గోవా రాష్ట్రంలో ఉమ్మడి కోడ్‌ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో న్యాయ శాఖ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం గత నెలలో గోవాను సందర్శించి అక్కడ అమలవుతున్న సివిల్‌ కోడ్‌ (దీనినే గోవా కుటుంబ చట్టం అని కూడా అంటారు)పై అధ్యయనం చేసింది. ముఖ్యంగా అందులోని వివాహ సంబంధ నిబంధనలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయని, మరికొన్ని కాలం చెల్లినవి కూడా ఉన్నాయని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. గోవాతో పాటు డామన్‌, డయ్యూ, దాద్రా-నగర్‌ హవేలీ ఒకప్పుడు పోర్చుగీసు (పోర్చుగల్‌) అధీనంలో ఉండేవన్న సంగతి తెలిసిందే. 1869లో ఇక్కడ పోర్చుగీసు కోడ్‌ అమల్లోకి వచ్చింది. నాటి నుంచి ఆ దేశం కాలక్రమేణా అందులో మార్పులు చేస్తూ వచ్చింది. అవి ఇక్కడ కూడా అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత గోవా 1961లో భారత్‌లో విలీనమైనా.. కోడ్‌ మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. అందులోని నిబంధనల  ప్రకారం.. ఏ మతం వారికైనా, కులంవారికైనా వివాహాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. పెళ్లికి ముందు, తర్వాత భార్యాభర్తలు సంపాదించిన ఆస్తిపై ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది. వివాహానికి పూర్వమే దీనిపై ఒప్పందం చేసుకోవాలి. భార్య అంగీకారం లేకుండా భర్త, భర్త ఆమోదం లేకుండా భార్య తమ ఆస్తులను విక్రయించడానికి వీల్లేదు. ఒకవేళ విడాకులిస్తే భార్యకు భర్త తన ఆస్తిలో సగం ఇచ్చి తీరాలి. ఇక తల్లిదండ్రులు  తమ ఆస్తిలో సగాన్ని పిల్లలకు (స్త్రీపురుషులకు) సమానంగా పంచాలి. గోవాలో వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకున్న ముస్లింలకు బహుభార్యత్వం నిషేధం. అలాగే ట్రిపుల్‌ తలాక్‌కు కూడా అవకాశం లేదు. బహుభార్యత్వం విషయంలో హిందువులకు మినహాయింపు ఇవ్వడం గమనార్హం. భార్యకు 25 ఏళ్లలోపు సంతానం కలగకపోతే.. 31 ఏళ్లలోపు మగ సంతానాన్ని కనకపోతే భర్త రెండో వివాహం చేసుకోవచ్చు. అలాగే రోమన్‌ కేథలిక్కులు తమ వివాహాలను చర్చిలో రిజిస్టర్‌ చేయించుకోవచ్చు. అది ఇచ్చే ధ్రువపత్రాలు చెల్లుబాటవుతాయి.  మిగతా వర్గాలు మాత్రం సివిల్‌ రిజిస్ట్రార్‌ వద్ద పెళ్లిళ్లు రిజిస్టర్‌ చేయించుకోవలసిందే. చర్చిల్లో వివాహం చేసుకునే వారికి విడాకుల నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. హిందువుల్లో మాత్రం.. భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భర్త విడాకులు కోరవచ్చు. అలాగే దత్తత, అక్రమ సంతానం విషయంలో కూడా గోవా సివిల్‌ కోడ్‌లో విభిన్న నిబంధనలు ఉన్నాయి. 

Updated Date - 2022-08-01T08:01:50+05:30 IST