Durga Puja: గర్బా నృత్యానికి హైందవేతరుల హాజరుపై ఆంక్షలు

ABN , First Publish Date - 2022-10-01T16:41:20+05:30 IST

శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా (Durga) పూజలలో భాగంగా

Durga Puja: గర్బా నృత్యానికి హైందవేతరుల హాజరుపై ఆంక్షలు

భోపాల్ : శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా (Durga) పూజలలో భాగంగా నిర్వహించే గర్బా (Garba) నృత్య కార్యక్రమాలకు హైందవేతరుల  (Non Hindus) హాజరుపై ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారి పూర్తి వివరాలను తనఖీ చేయాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఈ పూజల నిర్వాహకులకు సూచించింది. 


దుర్గా నవరాత్రి (Durga Navratri) ఉత్సవాలు సోమవారం నుంచి జరుగుతున్నాయి. సంప్రదాయ గర్బా నృత్య (garba dance) కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఉజ్జయిని జిల్లాలోని నానాఖేదలో గర్బా నృత్య కార్యక్రమాన్ని సంస్కృతి సమితి నిర్వహించింది. ఈ ప్రాంగణం వద్ద ఓ పోస్టర్ కనిపించింది. దానిలో ‘‘గర్బా ప్రాంగణంలోకి హైందవేతరులకు ప్రవేశం నిషిద్ధం’’ అని రాసి ఉంది. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారి గుర్తింపు కార్డులను పరిశీలించి, నుదుట కుంకుమ బొట్టు పెట్టారు. ఈ సంస్థ అధ్యక్షుడు బహదూర్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ, హైందవేతరులు గర్బా నృత్య కార్యక్రమాల్లో నానా యాగీ చేయడానికే వస్తున్నారని, అందుకే వారిని ప్రవేశించనివ్వరాదని నిర్ణయించామని చెప్పారు. 


నర్మదా పురం జిల్లాలోని శ్రీ సమర్పణ్ వెల్ఫేర్ సొసైటీ కూడా ఇటువంటి ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారి గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు డ్రెస్ కోడ్ పెట్టింది. ఈ కార్యక్రమ నిర్వాహకుడు స్వదేశ్ సైనీ మాట్లాడుతూ, కేవలం హిందువులు (Hindus) భారతీయ సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించి, హాజరుకావాలని నిబంధన పెట్టామన్నారు. 


మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, గర్బా నృత్య కార్యక్రమానికి హాజరయ్యే వ్యక్తుల గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలని కార్యక్రమ నిర్వాహకులను కోరినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు హిందూ మతానికి చాలా ముఖ్యమైనవని తెలిపారు. ఈ పవిత్ర సందర్భంలో శాంతిసామరస్యాలను కాపాడటం కోసం గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే గర్బా నృత్య కార్యక్రమాలను చూసేందుకు అనుమతించాలని సూచించామని చెప్పారు. 


Updated Date - 2022-10-01T16:41:20+05:30 IST