Shiv Sena Vs Enforcement Directorate : సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2022-07-31T17:18:21+05:30 IST

జీవితంలో గెలవాలంటే అహంకారాన్ని విడనాడాలని, ఈ విషయాన్ని

Shiv Sena Vs Enforcement Directorate : సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు

ముంబై : జీవితంలో గెలవాలంటే అహంకారాన్ని విడనాడాలని, ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెప్పాలని గర్జించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఆదివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) సోదాలు ప్రారంభించింది. ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం హాజరుకావాలని ఈడీ రెండుసార్లు సమన్లు ఇచ్చినప్పటికీ, ఆయన ఆ ఆదేశాలను పాటించకపోవడంతో ఈ చర్యలు చేపట్టింది. 


2022 జూన్‌లో సంజయ్ రౌత్ (Sanjay Raut) పుణేలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ (Baba Saheb Ambedkar) సాంస్కృతిక్ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, గౌతమ బుద్ధుని (Gautama Buddha) బోధనలను ప్రస్తావించారు. అహంకారాన్ని విడనాడినవారు జీవితంలో విజేతలవుతారని, కానీ కొందరు అహంకారాన్ని పెంచి పోషించుకుంటారని అన్నారు. అహంకారాన్ని పక్కనబెడితే, సమాజం, రాష్ట్రం, దేశంలో విస్తరించిన అనేక సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ విషయాన్ని ఎవరైనా నరేంద్ర మోదీ (Narendra Modi)కి చెప్పాలన్నారు. 


శివసే, బీజేపీ (BJP) హిందుత్వాన్ని (Hindutwa) పాటించే పార్టీలే అయినప్పటికీ, మహారాష్ట్ర (Maharashtra) శాసన సభకు 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56,  ఎన్‌సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలు లభించడంతో ఇరు పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. తమకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తామని శివసేన (Shiv Sena) పట్టుబట్టింది. బీజేపీ ససేమిరా అంది. ఆ తర్వాత కొద్ది గంటలపాటు ఎన్‌సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అగాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 


ఈ కూటమి కాపురం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొనసాగుతోందన్న దశలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) రంగంలోకి దిగింది. మసీదుల్లోంచి దిక్కులు పిక్కటిల్లే విధంగా లౌడ్‌స్పీకర్లలో శబ్దాలు వస్తున్నాయని, వాటిని ఆపాలని లేదంటే, మసీదుల ఎదుట తాము హనుమాన్ చాలీసా (Hanuman Chalisa)  పఠిస్తామని హెచ్చరించింది. మరోవైపు స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ (Navneet Kaur), ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా (Ravi Rana) శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించారు. ఈ దంపతులపై కేసు నమోదు చేసి, జైల్లో పెట్టారు. అనంతరం మహా వికాస్ అగాడీ కూటమిలో, మరీ ముఖ్యంగా శివసేనలో అగ్గి రాజుకుంది. 


ఉద్దవ్ థాకరేకు సంజయ్ అత్యంత సన్నిహితుడు

ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్ అత్యంత సన్నిహితులు. శివసేన ఆధ్వర్యంలో వెలువడుతున్న మరాఠీ పత్రిక ‘సామ్నా’కు  సంజయ్ రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఇరువురి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినా సంజయ్ రౌత్ తన పార్టీ చీఫ్ ఉద్ధవ్ పట్ల అత్యంత విధేయత కనబరిచారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు జీవచ్ఛవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన కార్యకర్తలు రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు. చివరికి బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. 


వెంటాడుతున్న ఈడీ

మోదీ, బీజేపీలను తీవ్రంగా, పదునైన మాటలతో విమర్శిస్తున్న సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెంటాడుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారుల బృందం సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ముంబైలోని బందూప్‌లో ఉన్న సంజయ్ నివాసానికి చేరుకుని, సోదాలు ప్రారంభించారు. ముంబైలోని ఓ భవనం అభివృద్ధి, దానికి సంబంధించిన లావాదేవీలు, ఆయన సతీమణి, సన్నిహితుల లావాదేవీలపై  ప్రశ్నిస్తోంది. 


లొంగిపోయేది లేదు, పోరాటం కొనసాగిస్తాను

ఈడీ అధికారులు తన నివాసానికి చేరుకున్న తర్వాత సంజయ్ రౌత్ ఓ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు చర్య, తప్పుడు సాక్ష్యాలు. నేను శివసేనను వీడను. నేను మరణించినా సరే, లొంగిపోయేది లేదు. నాకు ఎలాంటి కుంభకోణంతోనూ సంబంధం లేదు. శివసేన చీఫ్ బాలాసాహెబ్ థాకరే మీద ప్రమాణం చేసి ఈ విషయం చెప్తున్నాను. పోరాడటాన్ని ఆయన మాకు నేర్పించారు. శివసేన కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను’’ అని పేర్కొన్నారు. 


నిర్దోషి అయితే భయమెందుకు?

ఇదిలావుండగా, సంజయ్ రౌత్ ఈడీ సమన్లకు అనుగుణంగా స్పందించకపోవడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఆయన అమాయకుడైతే ఈడీకి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయడానికి సమయం ఉంటుంది కానీ, ఈడీ కార్యాలయానికి వెళ్ళడానికి సమయం ఉండదా? అని నిలదీసింది. 


సంజయ్ సతీమణి, మరికొందరిపై...

సంజయ్ రౌత్‌ను జూలై 1న ఈడీ అధికారులు దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. మరోవైపు సంజయ్ రౌత్ సతీమణి వర్ష రౌత్‌కు, ఆయన ఇద్దరు సన్నిహితులకు చెందిన దాదాపు రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఏప్రిల్‌లో జప్తు చేసింది. దాదర్‌ ప్రాంతంలోని వర్ష రౌత్‌కు చెందిన ఓ ఫ్లాట్, ఆమెకు, స్వప్న పట్కర్‌కు ఉమ్మడిగా అలీబాగ్‌లోని కిహిం బీచ్ వద్ద ఉన్న ఎనిమిది స్థలాలను జప్తు చేసింది. సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడైన సుజిత్ పట్కర్ భార్య స్వప్న పట్కర్.


ప్రవీణ్ రౌత్, సుజిత్ పట్కర్‌లతోగల సన్నిహిత వ్యాపార, ఇతర అనుబంధం గురించి సంజయ్ రౌత్‌ను ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. సంజయ్‌కు ప్రవీణ్, సుజిత్ అత్యంత సన్నిహితులు. సంజయ్ సతీమణి వర్ష ఆస్తి లావాదేవీల గురించి కూడా ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గురుగ్రామ్ ప్రాంతంలోని పట్రా చావల్ రీ-డెవలప్‌మెంట్‌కు సంబంధించిన రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణం కేసులో ప్రవీణ్ రౌత్‌ను అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పట్రా చావల్ రీడెవలప్‌మెంట్‌లో గురు ఆశీష్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమేయం ఉందని, 47 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 672 మంది కౌలుదారులు అద్దెకు ఉంటున్నారని తెలిపింది. ఇది మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్‌కు చెందినదని పేర్కొంది. 


Read more