Delhi liquor policy scam case: మనీష్ సిసోడియాపై ఈడీ కేసు త్వరలో

ABN , First Publish Date - 2022-08-21T19:10:02+05:30 IST

ఎక్సయిజ్ పాలసీ అమలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు

Delhi liquor policy scam case: మనీష్ సిసోడియాపై ఈడీ కేసు త్వరలో

న్యూఢిల్లీ : ఎక్సయిజ్ పాలసీ అమలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) కూడా కేసును నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సిసోడియాతోపాటు మరికొందరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎఫ్ఐఆర్ నకలును ఈడీకి సీబీఐ ఆదివారం అందజేసింది. 


ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం 2021-22కు సంబంధించి మనీశ్ సిసోడియా, ప్రభుత్వ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. టెండర్ల తర్వాత లైసెన్స్ పొందినవారికి అనుకూలంగా అనుచిత ప్రయోజనాలను కల్పించేందుకు వీలుగా, తగిన అధికారాలుగల అధికారి అనుమతి లేకుండా వీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. ఈ ఎక్సయిజ్ విధాన రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలతో ప్రమేయంగల లిక్కర్ వ్యాపారుల్లో సమీర్ మహేంద్రు ఒకరని తెలిపింది. సమీర్ ఇండోస్పిరిట్ కంపెనీ యజమాని అని పేర్కొంది. మనీశ్ సిసోడియాకు అత్యంత సన్నిహితులకు రెండుసార్లు కోట్లాది రూపాయలను సమీర్ చెల్లించినట్లు వివరించింది. 


ఎక్సయిజ్ పాలసీ అమలులో అక్రమాలకు సంబంధించిన కేసులో నిందితులు దేశం విడిచి వెళ్ళకుండా నిరోధించేందుకు సీబీఐ మనీశ్ సిసోడియాతో పాటు మరో 13 మందిపై లుక్ఔట్ సర్క్యులర్లను ఆదివారం జారీ చేసింది. వీరందరినీ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. లుక్ఔట్ సర్క్యులర్ జారీ అయితే నిందితులు విదేశాలకు వెళ్ళడానికి వీలుండదు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారిని అరెస్టు చేయవచ్చు. ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ కేసు నమోదు చేయబోతున్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో,  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి, ఇదేం నాటకమని ప్రశ్నించారు. సీబీఐ ఈ రోజు ఎవరికి లుక్ఔట్ నోటీసు ఇవ్వాలో ప్రధాన మంత్రి ఆలోచిస్తుండటం దురదృష్టకరమన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలకు పరిష్కారం చూపగలిగే నాయకుని కోసం దేశం చూస్తోందన్నారు. వారికి 2024లో ప్రజలు లుకౌట్ నోటీసు ఇస్తారన్నారు. 


Updated Date - 2022-08-21T19:10:02+05:30 IST