Former Chief Minister: మాజీ సీఎంకు సుప్రీంకోర్టులో మళ్లీ చుక్కెదురు

ABN , First Publish Date - 2022-09-13T13:57:52+05:30 IST

స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edapp

Former Chief Minister: మాజీ సీఎంకు సుప్రీంకోర్టులో మళ్లీ చుక్కెదురు

                       - అన్నాడీఎంకే కార్యాలయం అప్పగింత కేసులోనూ ఎదురుదెబ్బే


చెన్నై, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami)కి అప్పగిస్తూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరోమాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిర్ద్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పార్టీ నుంచి తొలగించబడిన ఓపీఎస్‌ పార్టీ కార్యాలయంపై తనకే హక్కులున్నాయని ఎలా చెప్పగలుతున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలై 11న ఓపీఎస్‌ రాయపేటలోని పార్టీ కార్యాలయంలోకి వెళ్ళినప్పుడు రెండు వర్గాల కార్యకర్తలు హింసాకాండకు పాల్పడటంతో రెవెన్యూ అధికారులు ఆ కార్యాలయాన్ని మూసి సీలు వేశారు. ఆ సీలు తొలగించి పార్టీ కార్యాలయాన్ని తమకు అప్పగించాలంటూ ఈపీఎస్‌, ఓపీఎస్‌ పెట్టుకున్న పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‏కుమార్‌(Satish Kumar) విచారణ జరిపి ఆ కార్యాలయాన్ని ఈపీఎస్‌ వర్గానికి అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓపీఎస్‌ ఆగస్టు 4న సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేశారు. దీనిపై ఆగస్టు 18న విచారణ జరిగినప్పుడు సర్వసభ్యమండలి మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకు ఓపీఎ్‌సను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించామని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయనకు పార్టీ కార్యాలయాన్ని ఎలా అప్పగించగలమని  ఈపీఎస్‌ తరఫు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. పార్టీ సమన్వయకర్తగా వున్న పన్నీరు సెల్వా నికే కార్యాలయంపై పార్టీ సర్వహక్కులు ఉన్నాయంటూ ఓపీఎస్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ అప్పీలుకు సంబంధించి ఈపీఎస్‌, రెవెన్యూ అధికారులు కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు సోమవారం మళ్లీ విచారణను ప్రారంభించిన సుప్రీంకోర్టు పార్టీ పదవిని కోల్పోయిన ఓపీఎస్‏కు పార్టీ కార్యాలయంపై హక్కులు ఎలా ఉంటాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ కార్యాలయాన్ని ఈపీఎస్‌ వర్గీయులకు అప్పగిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సబబేనని స్పష్టం చేస్తూ ఓపీఎస్‌ అప్పీలును తోసిపుచ్చింది.


ధర్మం గెలించించింది: ఈపీఎస్‌

సుప్రీంకోర్టు తీర్పు పట్ల అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి ఈపీఎస్‌ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన సేలంలో విలేఖరులతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం, ధర్మం గెలిచాయన్నారు. పార్టీని కించపరిచేలా చీటికిమాటికి కోర్టులకు వెళ్తున్న ఓపీఎస్‌ను మళ్లీ ఎలా దరి చేర్చుకోగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రధానమైన సమస్యలన్నీ కోర్టు ద్వారా పరిష్కారం కావడంతో త్వరలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈపీఎస్‌ ప్రకటించారు. 


సంస్థాగత ఎన్నికల కేసుకు బ్రేక్‌...

అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. పార్టీ నిబంధనలను ఉల్లఘించి సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమంటూ తిరుచెందూరుకు చెందిన రామ్‌కుమార్‌ ఆదిత్తన్‌, మాజీ ఎంపీ పళనిస్వామి కుమారుడు సురేన్‌ పళనిస్వామి పిటిషన్లు వేశారు. హైకోర్టు న్యాయమూర్తి వేల్‌మురుగన్‌ ఎదుట ఆ పిటిషన్లపై విచారణ జరిగినప్పుడు పిటిషనర్లు పార్టీ సభ్యులే కాదని ఈపీఎస్‌(EPS) తరఫు న్యాయవాదులు వాదించారు. అయినా వారి మాటల్ని పట్టించుకోని న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈపీఎస్‌ వర్గీయులు అప్పీలు పిటిషన్‌వేశారు. దానిపై జరిగిన విచారణకు హాజరైన ఈపీఎస్‌ తరఫు న్యాయవాది విజయనారాయణన్‌ హాజరై పిటిషనర్లు పార్టీసభ్యులు కారన్న వాదనను సింగిల్‌ జడ్జి తోసిపుచ్చారంటూ అందుకు తగిన ఆధారాలను సమర్పించారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఎం. దురైసామి, సుందర్‌మోహన్‌లతో కూడిన ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. 

Updated Date - 2022-09-13T13:57:52+05:30 IST