Former CM: అవినీతి కేసులో మాజీ సీఎంకు చుక్కెదురు

ABN , First Publish Date - 2022-09-15T13:19:20+05:30 IST

రహదారులశాఖ అవినీతి కేసులో తనపై అవినీతి నిరోధకశాఖ తదుపరి చర్యలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన

Former CM: అవినీతి కేసులో మాజీ సీఎంకు చుక్కెదురు

- పిటిషన్‌ తోసిపుచ్చిన హైకోర్టు

- తదుపరి చర్యలు చేపట్టవచ్చని స్పష్టీకరణ


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 14: రహదారులశాఖ అవినీతి కేసులో తనపై అవినీతి నిరోధకశాఖ తదుపరి చర్యలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami)కు చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అంతేగాక అవసరమైతే అవినీతి నిరోధకశాఖ తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని స్పష్టం చేసింది. వివరాలిలా... రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్‌ఎస్‌ భారతి మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పళనిస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణ ఉత్తర్వులు రద్దు చేసి, కేసు మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో, టెండర్‌ అవినీతి కేసులో బదులు పిటిషన్‌ వేసే వరకు ఏసీబీ తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించాలని కోరుతూ పళనిస్వామి మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా అవినీతి కేసులో ప్రాథమిక విచారణ నివేదిక ఏసీబీ కమిషనర్‌ వద్ద ఉందని ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాది పేర్కొన్నారు. ఈ స్థాయిలో కేసు నిలుపుదల చేయడం సబబు కాదన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈపీఎస్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Updated Date - 2022-09-15T13:19:20+05:30 IST