Former Chief Minister: ఆ పార్టీ పాలనలో కమీషన్, కరప్షన్, కలెక్షన్‌..

ABN , First Publish Date - 2022-09-17T13:51:27+05:30 IST

ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని డీఎంకే 15 నెలల పాలనలో కమీషన్‌, కరప్షన్‌, కలెక్షన్‌లే విపరీతంగా పెరిగాయని, రాష్ట్రాభివృద్ధి శూన్యమని

Former Chief Minister: ఆ పార్టీ పాలనలో కమీషన్, కరప్షన్, కలెక్షన్‌..

- ఇదే ఈ ప్రభుత్వంలో పెరిగిన అభివృద్ధి 

- చెంగల్పట్టు ధర్నాలో ఎడప్పాడి ధ్వజం


చెన్నై, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని డీఎంకే 15 నెలల పాలనలో కమీషన్‌, కరప్షన్‌, కలెక్షన్‌లే విపరీతంగా పెరిగాయని, రాష్ట్రాభివృద్ధి శూన్యమని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ధ్వజమెత్తారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో శుక్రవారం చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చెంగల్పట్టు పాతబస్టాండు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ధర్నానుద్దేశించి ఈపీఎస్‌ ప్రసంగిస్తూ... డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టాలిన్‌ కుటుంబీకులే పరిపాలిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, డీఎంకే(DMK) పాలనలో ప్రజలకు లభించిన బోనస్‌ ఏదంటే ఆస్తి పన్ను రెట్టింపు చేయడమేనని, దీనికి తోడు విద్యుత్‌ చార్జీలను, కొత్త విద్యుత్‌ కనెక్షన్ల చార్జీలను పెంచి ప్రజలను కష్టాలకడలిలోకి నెట్టారని ఆరోపించారు.  ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి పెరిగిపోయందని, మంత్రులంతా వసూళ్లలో పడ్డారని విమర్శించారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ ధర్నాలో ఈపీఎస్‌ సహా నాయకులంతా విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో పార్టీ నాయకులు ఆరుముగం, సిట్లపాక్కం రాజేంద్రన్‌, మాజీ ఎమ్మెల్యేలు సునితా సంపత్‌, మనోహరన్‌, మధురాంతకం శాసనసభ్యుడు మరగతం కుమారవేల్‌, సంపత్‌కుమార్‌, రవికుమార్‌, శెంథిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈధర్నా కారణంగా చెంగ్పట్టులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలన్నింటిని బైపాస్‌ మీదుగా మళ్ళించిన పోలీసులు ఆందోళన నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.


చెన్నైలో 9 చోట్ల ధర్నా...

రాజధాని నగరం చెన్నైలో అన్నాడీఎంకే తొమ్మిది జిలాల్లో తొమ్మిది ప్రాంతాల్లో విద్యుత్‌ చార్జీలకు నిరసనగా ధర్నా, రాస్తారోకో నిర్వహించింది. ఎంజీఆర్‌నగర్‌లో విరుగై వీఎన్‌ రవి నాయకత్వంలో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి వలర్మతి(Former Minister Valarmati) తదితరులు పాల్గొనగా, తండయార్‌పేటలో జిల్లా కార్యదర్శి ఆర్‌ఎస్‌ రాజేష్‌ నాయకత్వంలో, శెంబియం విద్యుత్‌ బోర్డు కార్యాలయం వద్ద జిల్లా కార్యదర్శి టీజీ వెంకటే్‌షబాబు నాయకత్వలో ధర్నా జరిగింది. ఇదే విధంగా కలెక్టరేట్‌ వద్ద జిల్లా కార్యదర్శి ఎన్‌.బాలగంగా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. టి.నగర్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి టినగర్‌ సత్యా నేతృత్వంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి గోకుల ఇందిరా తదితరులు, వళ్లువర్‌కోట్టమ్‌ వద్ద పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ నాయకత్వంలో దర్నా జరిగింది. పట్టాలంలో మాజీ మంత్రి డి.జయకుమార్‌, చోళింగనల్లూరులో , అడయార్‌ టెలిఫోన్‌ ఎక్చేంజి ఎదుట ఆయా జిల్లాల నేతల నాయకత్వంలో ధర్నాలు జరిగాయి.


తిరువళ్లూరులో...

అన్నాడీఎంకే తిరువళ్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోరూరు కారంబాక్కంలో జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి బెంజిమన్‌ నాయకత్వంలో, కోయంబత్తూరు రెడ్‌క్రాస్‌ సంఘం ఎదుట మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి నేతృత్వంలో, ఈరోడ్‌ సూరంపట్టి ఫోర్‌వే రోడ్డులో జిల్లా కార్యదర్శి మాజీ మంత్రి కేవీ రామలింగం, గోపిశెట్టిపాళయంలో మాజీ మంత్రి సెంగోట్టయ్యన్‌ నాయకత్వంలో ధర్నాలు జరిగాయి. తిరుప్పూరు(Tiruppur) కుమరన్‌ విగ్రహం కూడలి వద్ద జరిగిన ధర్నాకు మాజీ మంత్రి పొల్లాచ్చి జయరామన్‌ నాయకత్వం వహించారు. ఉడుమలపేటలో మాజీ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్‌ నాయకత్వంలో, తిరునల్వేలి జంక్షన్‌ వద్ద జిల్లా కార్యదర్శి తచ్చై గణేశ్‌రాజా నాయకత్వంలో, తెన్‌కాశి బస్టాండు వద్ద జిల్లా కార్యదర్శి సెల్వమోహన్‌దా్‌స నాయకత్వంలో ఆందోళనలు నిర్వహించారు.

Read more