Former Chief Minister: మీతో ఎలా కలుస్తాం?

ABN , First Publish Date - 2022-08-19T14:02:25+05:30 IST

పదవి పోయిందన్న ఆగ్రహంతో పార్టీ కార్యాలయ ధ్వంసానికి పాల్పడడంతో పాటు పార్టీని నాశనం చేసేందుకు యత్నించిన వ్యక్తితో ఎలా కలిసి పని చేస్తామని

Former Chief Minister: మీతో ఎలా కలుస్తాం?

- పదవుల కోసం పాకులాటడటమే మీ లక్ష్యం

- ఓపీఎస్‏పై విరుచుకుపడ్డ ఈపీఎస్‌


చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పదవి పోయిందన్న ఆగ్రహంతో పార్టీ కార్యాలయ ధ్వంసానికి పాల్పడడంతో పాటు పార్టీని నాశనం చేసేందుకు యత్నించిన వ్యక్తితో ఎలా కలిసి పని చేస్తామని అన్నాడీఎంకే సమన్వయకర్త ఓపీఎ్‌సపై ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శశికళ, దినకరన్‌లతో కలిసి పని చేద్దామంటూ ఓపీఎస్‌ పిలుపునివ్వడంపై ఈపీఎస్‌ మండిపడ్డారు. గ్రీన్‌వేస్ రోడ్డులో నివాసం వద్ద గురువారం మధ్యాహ్నం ఈపీఎస్‌ విలేఖరులతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందని, మళ్ళీ ఆ రెండూ ఏకం కావటంతో పార్టీ సర్వసభ్యమండలి సమావేశం నిర్వహించి,  సభ్యుల ద్వారా సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులను సృష్టించి ప్రధాన కార్యదర్శికి గల అన్ని అధికారాలను ఆ రెండు పదవులకు కల్పించినట్లు తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పార్టీలో సర్వసభ్యమండలికే అన్ని అధికారాలున్నాయన్న విషయం స్పష్టమవుతుందన్నారు. ఆ రెండు పదవుల కోసం పార్టీ నియమనిబంధనలను సవరించటం కూడా జరిగిందన్నారు. అదే తరహాలో ఏకనాయకత్వం దిశగా సర్వసభ్యమండలి సమావేశం ద్వారానే పార్టీ నిబంధనలను సవరించామని, ఇందులో పార్టీ నియమావళిని అతిక్రమించలేదని స్పష్టం చేశారు. సమన్వయకర్త, ఉప సమన్వయకర్తలుగా మళ్ళీ ఎన్నికైనప్పుడు సర్వసభ్యమండలి ఆమోదం అవసరమని పార్టీ నియమావళి చెబుతోందని, ఆ దిశగా సర్వసభ్యమండలిని ఏర్పాటు చేసినప్పుడు ఆ రెండు పదవులను సభ్యులెవరూ ఆమోదించకపోవడంతో రెండు పదవులు రద్దయ్యాయనే భావించాల్సి ఉందన్నారు. హైకోర్టు(High Court)లో సర్వసభ్యమండలిలోని 2663 మంది పార్టీ నియమావళిని సవరించగలరా? అనే ప్రశ్న వచ్చిందని, ఆ రెండు పదవులను సృష్టించింది కూడా సర్వసభ్యమండలి సమావేశం మాత్రమేనని తన తరఫు వాదనలు కూడా వినిపించామన్నారు. పార్టీలోని పదవులన్నీ ఎన్నికద్వారా భర్తీ చేయబడినవేనని, సర్వసభ్యమండలి సభ్యులు కూడా ఎన్నికల ద్వారానే నియమితులయ్యారన్నారు. జంట నాయకత్వం వద్దని సర్వసభ్య మండలి సమావేశంలో మెజారిటీ సభ్యులు కోరారన్నారు. 


పదవి లేకుంటే ఓపీఎస్‌ ధర్మయుద్ధం...

పార్టీలో పదవి లేకుంటే ఓపీఎస్‌ ధర్మయుద్ధానికి దిగటం సహజమని ఈపీఎస్‌ ఎద్దేవా చేశారు. పార్టీ అభివృద్ధి కోసం లేశమాత్రం కూడా పాటుపడకుండా పార్టీపై పట్టు సాధించాలని తాపత్రయపడతారని విమర్శించారు. తనకు, కుటుంబ సభ్యులకే పార్టీ పదవులుండాలని ఓపీఎస్‌ ఆరాటపడుతుంటారని, తన కుమారుడికి ఎంపీ సీటు కూడా పొందారన్నారు. ఇంత మేలు చేసిన పార్టీకి ఓపీఎస్‌ హాని చేశారని, పార్టీ ప్రధాన కార్యాలయంలో తన అనుచరుల చేత దాడి జరిపించారని, పార్టీ ఆస్తి పత్రాలన్నింటిని అపహరించుకుపోయారన్నారు. ఇలాంటి వ్యక్తితో తామెలా కలిసి పనిచేస్తామని ప్రశ్నించారు. ప్రస్తుతం సర్వసభ్యమండలి సమావేశంపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్ళామని, ఆ తీర్పు కోసం వేచి చూస్తామన్నారు. ప్రజల్లో, పార్టీలో మద్దతు ఉంటేనే నాయకులు రాణించగలగుతారని, ఓపీఎ్‌సకు ఆ మద్దతు వుంటే సర్వసభ్యమండలి సమావేశంలో తన బలాన్ని రుజువు చేసుకోవాలని ఈపీఎస్‌ సవాల్‌ విసిరారు.

Updated Date - 2022-08-19T14:02:25+05:30 IST