Ops ద్రోహి.. డీఎంకేతో కలిసి పార్టీపై కుట్ర: ఈపీఎస్‌

ABN , First Publish Date - 2022-07-12T13:33:54+05:30 IST

మూడుసార్లు ముఖ్యమంత్రిగా, పార్టీ కోశాధికారిగా, సమన్వయకర్తగా వ్యవహరించిన ఓపీఎస్‌.. ఆ విషయాన్ని మరిచి, పార్టీకి ద్రోహం తలపెట్టారని ఎడప్పాడా పళనిస్వామి(ఈపీఎస్‌)

Ops ద్రోహి.. డీఎంకేతో కలిసి పార్టీపై కుట్ర: ఈపీఎస్‌

చెన్నై: మూడుసార్లు ముఖ్యమంత్రిగా, పార్టీ కోశాధికారిగా, సమన్వయకర్తగా వ్యవహరించిన ఓపీఎస్‌.. ఆ విషయాన్ని మరిచి, పార్టీకి ద్రోహం తలపెట్టారని ఎడప్పాడా పళనిస్వామి(ఈపీఎస్‌) ఆరోపించారు. ఓపీఎస్‌ వర్గీయులు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద జరిపిన దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వెళ్లిన ఈపీఎస్‌.. అక్కడ మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశంలోనూ ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా వుంటానని ప్రకటించారు. డీఎంకేతో కలిసి ఓపీఎస్‌ అన్నాడీఎంకేపై కుట్రపన్నారని ఆరోపించారు. ఓపీఎస్‌ న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా రౌడీలతో కలసి వెళ్లి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు రికార్డులు తీసుకెళ్లారన్నారు. తమ కార్యకర్తలపై ఓపీఎస్‌ వర్గీయులు దాడి చేస్తుంటే పక్కకు తప్పుకున్న పోలీసులు.. ఆయన రికార్డులు తీసుకెళ్తుంటే మాత్రం భద్రత కల్పించారని ఆరోపించారు. అన్నాడీఎంకే కార్పొరేట్‌ ఆస్తి కాదని, ఇది కార్యకర్తల కష్టార్జితమన్నారు. అందుకే ఓపీఎ్‌సపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యాలయం వద్ద పోలీసులు రౌడీల ఆగడాలను అడ్డుకోలేదని, అందులోనూ దాడులకు పాల్పడిన వారిని వదలి తమ వర్గీయులపై దాడి చేశారని ఆరోపించారు. పార్టీ కార్యాలయానికి భద్రత కల్పించాల్సిందిగా మాజీ మంత్రి డి.జయకుమార్‌ సహా పలువురు నేతలు 20 రోజుల ముందే రాయపేట పోలీస్‏స్టేషన్‌, నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారని తెలిపారు. అయినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేను నామరూపాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కంకణం కట్టుకున్నారని, ఆయన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అన్నాడీఎంకేపై బురద చల్లే విధంగా పార్టీ కార్యాలయానికి సీలు వేయించారని ఆరోపించారు. 

Updated Date - 2022-07-12T13:33:54+05:30 IST