Delhi liquor policy case: 35 చోట్ల ఈడీ దాడులు

ABN , First Publish Date - 2022-09-06T16:28:04+05:30 IST

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు

Delhi liquor policy case: 35 చోట్ల ఈడీ దాడులు

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) దూకుడు పెంచింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మంగళవారం సోదాలు చేస్తోంది. అయితే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరగడం లేదు. 


ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ మంగళవారం ఢిల్లీ సహా గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో 35 చోట్ల సోదాలు జరుపుతోంది. ఈ కేసులో నిందితుడు సమీర్ మహేంద్రుకు చెందిన ఢిల్లీ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో నిందితుడుతైన మనీశ్ సిసోడియా నివాసం, కార్యాలయాలకు ఈడీ అధికారులు రాలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party-AAP) వర్గాలు మీడియాకు తెలిపాయి. 


ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, ఈ కేసులో మొదట సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) సోదాలు చేసిందని, ఏమీ దొరకలేదని, ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తోందని, వారికి కూడా ఏమీ దొరకబోవని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న మంచి పనులను ఆపడం కోసమే ఈ ప్రయత్నమని ఆరోపించారు. సీబీఐ, ఈడీ  కోరుకున్నప్పుడు రానివ్వండన్నారు. తనకు ఎటువంటి సమాచారం లేదని, వాళ్ళు వచ్చినా పాఠశాలల బ్లూప్రింట్లు మాత్రమే వారికి దొరుకుతాయని చెప్పారు. 


ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ గత నెలలో మనీశ్ సిసోడియా నివాసంలో తనిఖీలు చేసింది. ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ మాజీ కమిషనర్ అరవ గోపీ కృష్ణ కూడా ఈ కేసులో నిందితుడే. గత నెలలో ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 19 చోట్ల సీబీఐ సోదాలు చేసింది. 


Updated Date - 2022-09-06T16:28:04+05:30 IST