యంగ్‌ ఇండియన్‌ కార్యాలయంలో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2022-08-05T06:46:16+05:30 IST

యంగ్‌ ఇండియన్‌ కార్యాలయంలో సోదాలను ఈడీ గురువారం పునఃప్రారంభించింది. నిజానికి మంగళవారంనాడే ఆ కార్యాలయంలో ఈడీ సోదాలు

యంగ్‌ ఇండియన్‌ కార్యాలయంలో ఈడీ సోదాలు

హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆధారాల సేకరణ?

రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఆగ్రహం

ఆయన్ను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

మోదీకి భయపడే ప్రసక్తే లేదు: రాహుల్‌

కొత్త లోతులకు ‘మోదీషాహీ’: కాంగ్రెస్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 4: యంగ్‌ ఇండియన్‌ కార్యాలయంలో సోదాలను ఈడీ గురువారం పునఃప్రారంభించింది. నిజానికి మంగళవారంనాడే ఆ కార్యాలయంలో ఈడీ సోదాలు కొనసాగాల్సి ఉంది. కానీ.. ఆ ఆఫీసు ప్రధాన అధికారి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మల్లికార్జున ఖర్గే రాకపోవడంతో సోదా చేయలేదు. బుధవారం కూడా ఆయన రాకపోవడంతో.. సాక్ష్యాలను పరిరక్షించడం కోసం ఆ కార్యాలయానికి తాత్కాలికంగా సీల్‌ వేసింది. సోదాలు నిర్వహించే సమయంలో హాజరు కావాల్సిందిగా ఖర్గేకు మరోమారు ఈడీ మెయిల్‌ పంపింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఖర్గే ఆ ఆఫీసుకు రావడంతో ఆయన సమక్షంలో సోదాలు నిర్వహించింది. అక్కడ లభించిన కొన్ని పత్రాలు, డిజిటల్‌ డేటాను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించారు.


అంతేకాదు.. మల్లికార్జున ఖర్గేను దాదాపు 7 గంటలపాటు ఈడీ తరచి తరచి ప్రశ్నించింది. మధ్యాహ్నం 12.40కి కార్యాలయం వద్దకు వచ్చిన ఖర్గే.. రాత్రి 8.30 గంటలకు తిరిగి వెళ్లారు. కాగా.. నేషనల్‌ హెరాల్డ్‌తో సంబంధాలున్న సంస్థలకు, థర్డ్‌ పార్టీకి మధ్య జరిగిన హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ ఈ సోదాల్లో సేకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్‌ ఇచ్చిన వాంగ్మూలాలను ఈడీ పునఃపరిశీలిస్తోందని తెలిసింది. మరోవైపు.. భోపాల్‌లో నేషనల్‌ హెరాల్డ్‌ కోసం లీజుకు ఇచ్చిన భవనమూ దుర్వినియోగానికి గురైనట్టు మధ్యప్రదేశ్‌ సర్కారు గుర్తించింది. దీనిపై దర్యాప్తు చేసి.. అవసరమైతే ఆ భవనాన్ని సీల్‌ చేస్తామని మధ్యప్రదేశ్‌ మంత్రి భూపీందర్‌ సింగ్‌ తెలిపారు. 


అలా ఎలా పిలుస్తారు?

ఒకవైపు పార్లమెంటు సెషన్స్‌ జరుగుతుండగా, సోదాలకు రావాలంటూ ఈడీ అధికారులు తనను ఎలా పిలుస్తారని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఖర్గే రాజ్యసభలో నిలదీశారు. ‘‘నేను ఈడీ ముందు మధ్యాహ్నం 12.30 గంటలకు హాజరు కావాల్సి ఉంది. చట్టాన్ని పాటించే వ్యక్తిని నేను. కానీ.. పార్లమెంటు సెషన్స్‌ మధ్యలో ఈడీ నన్ను ఇలా పిలవడం భావ్యమా?’’ అని ఆయన సభలో ప్రశ్నించారు. బుధవారం పోలీసులు సోనియా, రాహుల్‌ నివాసాలను చుట్టుముట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా? అని ప్రశ్నించారు. దీనికి పీయూ్‌షగోయల్‌ బదులిస్తూ.. ‘‘ఎవరైనా తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు వాటిపని అవి చేస్తాయి. వాటి పనుల్లో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదు.  బహుశా కాంగ్రెస్‌ హయాంలో అలాంటివేమైనా జరిగి ఉండొచ్చ’’ని నర్మగర్భవ్యాఖ్యలు చేశారు.


మరోవైపు.. కాంగ్రెస్‌ నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఈ అంశంపై స్పందించారు. యంగ్‌ ఇండియన్‌ కార్యాలయానికి తాళం వేయడం లాంటివి భయపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలని.. కానీ, తాను మోదీకి భయపడే ప్రసక్తే లేదని, తమనెవరూ భయపెట్టలేరని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. నేను మాత్రం.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశంలో సామరస్యాన్ని కాపాడేందుకు పనిచేస్తూనే ఉంటాను’’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లే దారికి అడ్డంగా బారికేడ్‌లు పెట్టడాన్ని ఉద్దేశించి.. ‘‘నిజాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను ప్రధానికి భయపడను. దేశ ప్రయోజనాల కోసమే నేను ఎల్లప్పుడూ పనిచేస్తాను’’ అంటూ హిందీలో ట్వీట్‌ చేశారు. కాగా.. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లి, దేశ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు వినతిపత్రం సమర్పించనున్నారు. అలాగే, ప్రధాని నివాసాన్ని ఘెరావ్‌ చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రచించింది. ఇక.. ఖర్గేకు ఈడీ పిలుపు నేపథ్యంలో స్పందించిన కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌.. మోదీ, షాలు నియంతల్లా వ్యవహరిస్తున్నారని అర్థం వచ్చేలా.. ‘మోదీషాహీ కొత్త లోతులకు దిగజారుతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-08-05T06:46:16+05:30 IST