సుప్రీంకోర్టులో Epsకు ఊరట

ABN , First Publish Date - 2022-07-07T13:19:58+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) నేతృత్వంలో ఈ నెల 11న నిర్వహించనున్న సర్వసభ్యమండలి సమావేశానికి సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో Epsకు ఊరట

                                 - సర్వసభ్యమండలికి గ్రీన్‌ సిగ్నల్‌


చెన్నై, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) నేతృత్వంలో ఈ నెల 11న నిర్వహించనున్న సర్వసభ్యమండలి సమావేశానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అదేవిధంగా ఎడప్పాడికి వ్యతిరేకంగా హైకోర్టులో మరో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) దాఖలు చేసిన కోర్టు ఉత్తర్వుల ఉల్గంఘన పిటిషన్‌ విచారణ నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 23న జరిగిన సర్వసభ్యమండలి సమావేశానికి సంబంధించి హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎడప్పాడి వర్గీయులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఓపీఎస్‌ వర్గీయులు కేవియట్‌ పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వసభ్యమండలి సమావేశం సవ్యంగా జరిగేందుకు ఓపీఎస్‌ సహకరించడం లేదని, ప్రస్తుతం ఆయన కోశాధికారిగా మాత్రమే ఉన్నారని ఎడప్పాడి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. పార్టీ బాధ్యతలను ఓపీఎస్‌ సక్రమంగా నిర్వర్తించలేదని, కోశాధికారిగా ఆయన నిధులు విడుదల చేయకపోవడంతో పార్టీ కార్యాలయ సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. మెజారిటీ సభ్యుల మద్దతుతోనే తాము సర్వసభ్యమండలిని జరుపతలపెట్టామని వారు వివరించారు. జూన్‌ 23న జరిగిన సర్వసభ్యమండలి విషయమై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లఘించకుండా 23 తీర్మానాలపైనే సమావేశం జరిపినందున అప్పీలు అనవసరమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు  స్పష్టం చేశారు. హైకోర్టులో ప్రత్యర్థి వర్గం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పిటిషన్‌ వేసిందని ఎడప్పాడి తరఫు న్యాయవాదులు తెలపగా, ఓపీఎస్‌ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. ఇరుతరఫు వాదనల అనంతరం ధర్మాసనం సర్వసభ్యమండలి సమావేశాన్ని నిలుపుదల చేయలేమని స్పష్టం చేసింది. ఇరుపక్షాలు తమకు సంబంధించిన వివాదాలను హైకోర్టు ద్వారానే పరిష్కరించుకోవచ్చని సూచించింది.. పార్టీ వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేస్తూ.. హైకోర్టులో ఓపీఎస్‌ వర్గీయులు దాఖలు చేసిన కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పిటిషన్‌ విచారణపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. 


హైకోర్టులో ఓపీఎస్‌ పిటిషన్‌పై నేడు విచారణ...

ఈ నెల 11న జరుపతలపెట్టిన సర్వసభ్యమండలి సమావేశాన్ని నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ పన్నీర్‌సెల్వం వర్గీయులు దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణన్‌రామస్వామి ముందు గురువారం విచారణ జరుగనుంది. పార్టీ సమన్వయకర్త పదవీ కాలం ఐదేళ్ళని, ఆ లోగా తనను పదవి నుంచి తొలగించే దిశగా సర్వసభ్యమండలి సమావేశం జరుపుతున్నారని ఓపీఎస్‌ పిటిషన్‌లో ఆరోపించారు. పార్టీ సమన్వయకర్తగా ఉన్న తన అనుమతి లేకుండా జరుపతలపెట్టిన సమావేశాన్ని నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ బుధవారం మధ్యాహ్నం న్యాయమూర్తి కృష్ణన్‌రామస్వామి ముందు విచారణకు వచ్చింది. అయితే ఓపీఎస్‌ తరఫు న్యాయవాదులు గైర్హాజరవ్వడంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. 


ఈపీఎస్‌ వర్గంలో జోష్‌

సుప్రీంకోర్టు ఉత్తర్వులు తమకు సానుకూలంగా ఉండడంతో ఈపీఎస్‌ వర్గంలో జోష్‌ నెలకొంది. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సర్వసభ్యమండలి కి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ సమావేశాన్ని వానగరం శ్రీవారు వేంకటాచలపతి కల్యాణమండపంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపడుతున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ నిబంధనలతో సర్వసభ్యమండలి, కార్యాచరణ మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రవేశద్వారం వద్దే రెండు అంబులెన్స్‌ల్లో సమావేశానికి వచ్చేవారందరికి థర్మల్‌స్కాన్‌ నిర్వహించి, సభ్యులందరికీ శానిటైజర్లు, మాస్కులను కూడా అందజేయనున్నారు. కళ్యాణమండపం హాలులో సభ్యుల భోజనశాలు ఏర్పాటు చేస్తున్నారు. హాలు ముందుభాగంలో భారీ పందిరి కింద భౌతికదూరంతో సర్వసభ్యమండలి సమావేశాన్ని జరుపనున్నారు.

Read more