Nupur Sharmaకు మద్దతిస్తున్నందుకు గర్విస్తున్నా... చంపుతామన్నబెదిరింపులతో మరింత దృఢ చిత్తం... : డచ్ పొలిటీషియన్

ABN , First Publish Date - 2022-06-12T20:59:24+05:30 IST

ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడిన బీజేపీ మాజీ నేత నూపుర్

Nupur Sharmaకు మద్దతిస్తున్నందుకు గర్విస్తున్నా... చంపుతామన్నబెదిరింపులతో మరింత దృఢ చిత్తం... : డచ్ పొలిటీషియన్

న్యూఢిల్లీ : ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడిన బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మకు మద్దతివ్వడం గర్వకారణమని డచ్ పొలిటీషియన్ గీర్ట్ వీల్డర్స్ (Geert Wilders)  చెప్పారు. చంపుతామని వస్తున్న  వందలాది బెదిరింపులు తనను మరింత దృఢ చిత్తంతో వ్యవహరించేలా చేస్తున్నాయని చెప్పారు. 


Netherlands MP గీర్ట్ తాజాగా ఇచ్చిన ఓ ట్వీట్‌లో, తాను భారతీయుడిని కాదని, హిందువును కాదని, అయినప్పటికీ తాను నూపుర్ శర్మకు మద్దతిస్తున్నానని తెలిపారు. లౌకికవాదం అంటే హిందూ దేవతలను కించపరచడం సమర్థనీయమని, మహమ్మద్ గురించి నిజం చెప్పడం సమర్థనీయం కాదనే భావం కలుగకూడదని తాను నమ్ముతానని పేర్కొన్నారు. నూపుర్ శర్మకు బహిరంగంగా మద్దతివ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. తమ మతపరమైన అసహనాన్ని, విద్వేషాన్ని వ్యక్తం చేయడానికి కేవలం క్రిమినల్స్, ఉగ్రవాదులు మాత్రమే వీథుల్లో హింసకు పాల్పడతారన్నారు. హిందూ దేవతలను ఒకరు కించపరిచినపుడు నూపుర్ శర్మ స్పందించడం కచ్చితంగా సమర్థనీయమేనని తెలిపారు. అందుకే తాను ఆ సాహస వనితకు మద్దతిస్తున్నానని తెలిపారు. తనకు వందలాది బెదిరింపులు వస్తున్నాయని, దీంతో ఆమెను సమర్థించడం గర్వకారణమనే భావం మరింత బలపడిందని చెప్పారు. చెడు ఎన్నడూ విజయం సాధించదని స్పష్టం చేశారు. 


నూపుర్  శర్మ బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 


గీర్ట్ వీల్డర్స్ ఇటీవల ఇచ్చిన ట్వీట్‌లో అల్‌ఖైదా వంటి ఇస్లామిక్ ఉగ్రవాదులకు లొంగిపోవద్దని భారతీయులకు సలహా ఇచ్చారు. యావద్భారతావని నూపుర్ శర్మకు మద్దతివ్వాలన్నారు. అల్‌ఖైదా, తాలిబన్లు తనను ఓ ఏడాది క్రితం హిట్ లిస్ట్‌లో పెట్టాయన్నారు. ఉగ్రవాదులకు ఎన్నడూ లొంగిపోవద్దని చెప్పారు. నూపుర్ శర్మ నిజం చెప్పారని, ఆమెపై ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం హాస్యాస్పదమని అన్నారు. బుజ్జగింపుల వల్ల ఒరిగేదేమీ ఉండదని, పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. 


Updated Date - 2022-06-12T20:59:24+05:30 IST