bihar politics : పాంచ్‌ పటాకా... బీజేపీ - జేడీయూ కూటమి కొంపముంచిన 5 కారణాలు ఇవీ..

ABN , First Publish Date - 2022-08-09T21:48:31+05:30 IST

బుజ్జగింపుల కోసం బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎన్ని ఫోన్లు చేసినా సీఎం నితీష్ కుమార్ అస్సలు సమాధానమివ్వలేదు.

bihar politics : పాంచ్‌ పటాకా... బీజేపీ - జేడీయూ కూటమి కొంపముంచిన 5 కారణాలు ఇవీ..

పాట్నా : బుజ్జగింపుల కోసం బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎన్ని ఫోన్లు చేసినా నితీష్ కుమార్ (CM Nitish Kumar) అస్సలు సమాధానమివ్వలేదు. పైగా సోనియా గాంధీకి(Sonia Gandhi) ఫోన్ చేసి పరిస్థితులను పూసగుచ్చారు. ఆ వెనువెంటనే బీజేపీకి(BJP) గుడ్‌బై చెప్పడం.. ప్రభుత్వ ఏర్పాటుపై ఆర్‌జేడీ(RJD), కాంగ్రెస్‌లతో(Congress) చర్చలు.. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా  ఇలా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. వేరు కుంపటిపై పెద్దగా సంకేతాలేవీ లేకపోయినప్పటికీ.. మాజీ సీఎం నితీష్ కుమార్ ఉన్నపళంగా ఇలా బీజేపీకి కటీఫ్ చెప్పడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. నితీష్ నిర్ణయంపై అంతలా ప్రభావం చూపిన ఆ కారణాలు ఏంటో ఓ లుక్కేద్దాం...


కారణం-1

జనతాదళ్‌(యునైటెడ్‌) జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర తాజా మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్‌ శనివారం పార్టీకి రాజీనామా చేయడం బీజేపీ-జేడీయూ బంధంలో బీటలకు నాంది పలికింది. నిజానికి ఆయనను కేంద్ర మంత్రిగా బీజేపీ ఏకపక్షంగా ఎంపిక చేసింది. ఆయన అమిత్‌షాకు దగ్గరవుతున్నట్లు గుర్తించిన నితీశ్‌.. ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. లోక్‌ జనశక్తి మాదిరిగా.. ఆర్సీపీ సింగ్‌ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని నితీశ్‌ అనుమానించడమే ఇందుకు కారణమైంది. ఇదే విషయాన్ని జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ సోమవారం పేర్కొన్నారు. ఇంకోసారి కేంద్ర కేబినెట్‌లో చేరబోమని వివరించారు.


కారణం - 2

కేంద్ర కేబినెట్‌లో జేడీయూకీ సముచిత స్థానం కల్పించాలని నితీష్ కుమార్ ఎప్పటి నుంచో బీజేపీని డిమాండ్ చేస్తున్నారు. 2 మంత్రి పదవులు కోరుతున్నారు. కానీ 2019 నుంచి జేడీయూ తరపున ఒక్కరే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఇరు పార్టీలకూ చెరో 16 ఎంపీలు ఉన్నారు. కాబట్టి బిహార్ బీజేపీకి ఇచ్చినట్టే తమకూ మంత్రి పదవులు ఇవ్వాలని జేడీయూ కోరుతూ వచ్చింది. కానీ ఈ డిమాండ్‌ని బీజేపీ పెడచెవిన పెట్టింది. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ, జేడీయూ చెరో 16 ఎంపీ సీట్లు గెలిచాయి.


కారణం - 3

బీజేపీ కోటాలో బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్న విజయ్ కుమార్ సిన్హా అంటే నితీష్ కుమార్‌కు నచ్చదు. సభ లోపల, బయటా వీరిద్దరి మధ్య చాలా విభేదాలు చోటుచేసుకున్నాయని చెబుతారు. ఇందులో 2 ముఖ్యమైన ఘటనల ఉదహరిస్తే.. అసెంబ్లీ నిబంధనలను ప్రభుత్వ పక్షమే అతిక్రమిస్తోందని స్పీకర్‌‌గా ఉన్న విజయ్ కుమార్ సిన్హా 2022 మార్చిలో తప్పుబట్టడాన్ని సీఎం నితీష్ కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. ఇక కొవిడ్ నిబంధనలు అతిక్రమించారని బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై విజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించడం అప్పట్లో చర్చకు దారితీసింది. ఇలాంటి ఘటనలు బాగానే జరిగాయి.


కారణం - 4

కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై బీజేపీ ఆలోచిస్తోంది. కానీ ఈ నిర్ణయాన్ని జేడీయూ బాహాటంగానే వ్యతిరేకించింది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యంకాదని జేడీయూ అభిప్రాయపడింది. ఇదొక్కటే కాకుండా అగ్నిపథ్ స్కీమ్‌ని కూడా జేడీయూ వ్యతిరేకించింది. ఈ పథకానికి వ్యతిరేకంగా బిహార్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినా సీఎం నితీష్ అస్సలు నోరెత్తలేదనే విషయం తెలిసిందే. ‘కామన్ సివిల్ కోడ్’ విషయంలో కూడా జేడీయూ వైఖరి బీజేపీకి విరుద్ధంగా ఉంది.


కారణం - 5

బిహార్ ప్రభుత్వంలోని బీజేపీ కోటా మంత్రులపై నితీష్ కుమార్ పట్టుసాధించేందుకు ప్రయత్నించారు. మంత్రుల ఎంపికకు ముందు తన నిర్ణయం తీసుకోవాలని బీజేపీని కోరారు. కానీ బీజేపీ పట్టించులేదు. ఆయనను సంప్రదించకుండానే మంత్రి పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. సీఎం అభిప్రాయం తీసుకోకుండానే కేంద్ర మంత్రి అమిత్ షా తనకు నచ్చినవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించడంపై మాజీ  సీఎం నితీష్ కుమార్ అసహనానికి గురయ్యారని పలు రిపోర్టులు చెబుతున్నాయి.


గతంలోనూ బీజేపీకి ఝలక్‌లు..

జేడీయూ పార్టీ ఎన్‌డీయూలో ఎప్పటి నుంచో భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో గతంలోనూ ఒకసారి నితీష్ నుంచి బీజేపీ, ఆ పార్టీ లీడర్లకు ఎదురుదెబ్బతగిలింది. 2010లో బీజేపీ జాతీయ కార్యనిర్వహక సమావేశానికి నరేంద్ర మోదీ సహా పలువురు అగ్రశ్రేణి లీడర్లు బిహార్ వెళ్లారు. వారందరినీ నితీష్ కుమార్ డిన్నర్‌కి ఆహ్వానించారు. కానీ ఆ తర్వాత డిన్నర్‌ను రద్దు చేసి అందరికీ షాకిచ్చారు. దీనంతటికీ బీజేపీ నేత సుశీల్ మోదీని కారణమని నితీష్ విమర్శించడం గమనార్హం. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోదీ సారధ్యంలో సార్వత్రిక ఎన్నికలకు బీజేపీకి సిద్ధమవుతున్న తరుణంలో ఎన్‌డీయూ కూటమికి నితీష్ కుమార్ గుడ్‌బై చెప్పారు. దీంతో 17 ఏళ్ల బంధానికి బీటలుపడ్డాయి. 2002 గోద్రా అల్లర్ల ఘటనపై నితీష్ కుమార్ స్పందిస్తూ.. నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఉండి కూడా ఈ విమర్శలు చేయడం గమనార్హం.

Read more