డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియాలో తొలి పోస్ట్ ఇదే!

ABN , First Publish Date - 2022-02-16T22:01:17+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా ఏర్పాటు

డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియాలో తొలి పోస్ట్ ఇదే!

న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ మరికొద్ది రోజుల్లో జనం ముందుకు రాబోతోంది. ఈ వేదికపై ఆయన పోస్ట్ చేసిన తొలి సందేశం స్క్రీన్ షాట్‌ను ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ షేర చేశారు. 


డొనాల్డ్ ట్రంప్‌ను ఫేస్‌బుక్, ట్విటర్ ఓ ఏడాది క్రితం నిషేధించాయి. దీంతో ఆయన సొంతంగా ట్రూత్ సోషల్ అనే ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ కంపెనీ దీనిని అభివృద్ధిపరచింది. దీనిపై ఆయన ఇచ్చిన తొలి పోస్ట్‌లో, ‘‘గెట్ రెడీ, మీకు ఇష్టమైన అధ్యక్షుడు మిమ్మల్ని త్వరలో కలవబోతున్నారు’’ అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌పై అందుబాటులో ఉంది. మార్చిలో ఇది లైవ్‌లోకి వస్తుంది. ఈ వివరాలను ఈ సోషల్ మీడియా కంపెనీ సీఈఓ డెవిన్ నునెస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 


ఈ నూతన ప్లాట్‌ఫాం దాదాపు ట్విటర్‌ను పోలి ఉంది. ప్రజలను, ట్రెండింగ్ టాపిక్స్‌ను ఫాలో అవడానికి దీనిలో అవకాశం ఉంది. దీనిలో పోస్టులను ట్వీట్లు అని కాకుండా ట్రూత్స్ అంటారు. డొనాల్డ్ ట్రంప్ ఈ సైట్‌లో ఫిబ్రవరి 10న చేరారు. దాదాపు 175 మంది ఫాలోయర్లు ఉన్నారు. 


అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ బిల్డింగ్‌పై దాడి చేశారు. దీంతో ఆయన ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ నిషేధించాయి. ఈ నిరంకుశత్వాన్ని ఎదుర్కొనేందుకు తాను సొంతంగా సోషల్ మీడియా కంపెనీని ప్రారంభిస్తానని అప్పట్లో ఆయన ప్రకటించారు. 


ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో, అందరికీ గొంతునివ్వడం కోసం ట్రూత్ సోషల్‌ను అభివృద్ధిపరచినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మొదటి ట్రూత్‌ను ట్రూత్ సోషల్‌లో ఇవ్వడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 
Updated Date - 2022-02-16T22:01:17+05:30 IST

Read more