New Delhi : ఇళ్ల నుంచి వస్తున్న వ్యర్థాలు ఆందోళనకరం

ABN , First Publish Date - 2022-06-12T17:07:27+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యగా

New Delhi : ఇళ్ల నుంచి వస్తున్న వ్యర్థాలు ఆందోళనకరం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. వ్యర్థాలు పరిశ్రమల నుంచి  కన్నా ఎక్కువగా ఇళ్ళ నుంచి వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. బల్బులు, బ్యాటరీలు వంటివాటిని ఇళ్ల వద్దనే వేరు చేయకపోవడం వల్ల ప్రమాదకరమైన వ్యర్థాలు చెత్త కుప్పల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ రూపొందించిన నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 


ఢిల్లీలోని 2,318 పరిశ్రమల నుంచి సంవత్సరానికి 2,944.7 మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలు వెలువడతాయి. అదే స్థాయిలో కామన్ ఎఫ్లుయెంట్ ప్లాంట్స్ వద్ద వ్యర్థాలు పోగుపడుతున్నాయి. బవానా ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన ట్రీట్‌మెంట్, స్టోరేజ్, డిస్పోజల్ ఫెసిలిటీ (TSDF) సంవత్సరానికి దాదాపు 60,000 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను శుద్ధి చేయగలదు. 


ఇళ్ళ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు టీఎస్‌డీఎఫ్‌కు చేరే విధంగా చూడటం కోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇళ్ళ నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు సరైన వ్యవస్థను పురపాలక సంఘాలు ఏర్పాటుచేయడం లేదంటున్నారు. ప్రమాదకర వ్యర్థాలను వేరు చేయడం, సరైన విధంగా బయట పారేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లేదని చెప్తున్నారు. ఈ వ్యర్థాలు చెత్త కుప్పల్లోకి వెళ్ళడం కానీ, అనధికారిక వర్గాలకు చేరడం కానీ జరుగుతోందంటున్నారు. పగిలిపోయిన బల్బులు, ట్యూబులైట్లు, కెమికల్ కంటెయినర్లు వంటివాటి వల్ల పర్యావరణంపైనా, ప్రజల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్తున్నారు. చెత్త కుప్పల వద్ద పని చేసే కార్మికులకు కూడా హానికరమని చెప్తున్నారు. 


టీఎస్‌డీఎఫ్‌ను తమిళనాడు వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ కార్పొరేట్ హెడ్ సంజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఇళ్ళ నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వ సంస్థలు చేపట్టడం లేదు. ఈ ప్రమాదకర వ్యర్థాలు చట్టవిరుద్ధ మార్కెట్లకు తరలిపోతున్నాయి. నూనె సీసాలు, కలుషితమైన ప్లాస్టిక్ డబ్బాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటివన్నీ అనధికారిక మార్కెట్లకు చేరుతున్నాయి. 


ప్రమాదకర వ్యర్థాలను ఇళ్ళ వద్ద వేరు చేయాలని నిపుణులు సలహా ఇచ్చారు. ప్రమాదకర వ్యర్థాలను సురక్షితంగా బయట పారేయడం చాలా అవసరమని చెప్పారు. ఇటువంటి వ్యర్థాల కోసం ప్రత్యేకమైన చెత్త బుట్టలను పెడితే బాగుంటుందని తెలిపారు. 


Updated Date - 2022-06-12T17:07:27+05:30 IST