DMK: నెలకు రూ.లక్ష, సెల్‌ఫోన్‌..

ABN , First Publish Date - 2022-11-30T07:58:42+05:30 IST

అధికార డీఎంకే(DMK) లోక్‌సభ ఎన్నికలకు అప్పుడే సమయాత్తమవుతోంది. బూత్‌ కమిటీ నేతలకు లక్షలాది రూపాయల నగదు చెల్లిస్తోంది. వార్డు కమిటీ నేతలకు సెల్‌ఫోన్లు తదితర వస్తువులను సమకూర్చుతోంది.

DMK: నెలకు రూ.లక్ష, సెల్‌ఫోన్‌..

- ముందస్తు సన్నాహాలు ?

- లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే డీఎంకే ప్రాంతీయ నేతలకు కానుకల వర్షం

చెన్నై, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అధికార డీఎంకే(DMK) లోక్‌సభ ఎన్నికలకు అప్పుడే సమయాత్తమవుతోంది. బూత్‌ కమిటీ నేతలకు లక్షలాది రూపాయల నగదు చెల్లిస్తోంది. వార్డు కమిటీ నేతలకు సెల్‌ఫోన్లు తదితర వస్తువులను సమకూర్చుతోంది. ఇటీవల డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బూత్‌కమిటీ నేతలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలకు బూత్‌ కమిటీ ఏజెంట్లకు గతంలో లేనంతగా నగదు కానుకలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) పరిధిలో ఉన్న 200 వార్డుల కమిటీ నేతలకు తలా లక్ష రూపాయలు అందజేశారు. ఈ నగదును లోక్‌సభ ఎన్నికల పనులకు ఉపయోగించాలని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలో విరాళాల కోసం ఎవరి వద్ద చేయి చాచకుండా ఆయా ప్రాంతాల శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులు స్థానిక శాఖల నాయకులకు నగదు ఇవ్వాలని, ముఖ్యంగా బూత్‌ కమిటీ సభ్యులకు అడిగినంత నగదు, వాహన సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ ఓట్లు పోలయ్యేందుకు పాటుపడే స్థానిక శాఖ నేతలు, బూత్‌కమిటీ ఏజెంట్లకు, ఇన్‌ఛార్జిలకు లక్షలాది రూపాయలను నగదు కానుకగా ఇస్తామని పార్టీ అధిష్టానవర్గం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించేంత వరకు ప్రతి మూడు నెలలకు ఒక పర్యాయం బూత్‌ కమిటీ ఏజెంట్లు, స్థానిక శాఖల నాయకులకు సక్రమంగా నగదు కానుకలు, పారితోషికాలు అందుతున్నాయో లేదో నిఘా వేయాలని కూడా సీనియర్‌ నేతలకు పార్టీ అధిష్టానవర్గం ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-11-30T07:59:51+05:30 IST