Congress President Poll: అదే జరిగితే కాంగ్రెస్ జీరో : దిగ్విజయ్ సింగ్

ABN , First Publish Date - 2022-09-30T02:12:14+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల కోసం ఆ పార్టీ

Congress President Poll: అదే జరిగితే కాంగ్రెస్ జీరో : దిగ్విజయ్ సింగ్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల కోసం ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మాట్లాడుతూ, నెహ్రూ-గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పార్టీ శూన్యమేనని చెప్పారు. 


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల బరి  (Congress presidential race) నుంచి తప్పుకోవడంతో దిగ్విజయ్ సింగ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. 


తన ఎదుగుదలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర శాఖల్లో ఇటీవల కనిపిస్తున్న సంక్షోభాల గురించి మాట్లాడుతూ, గతంలో కూడా చాలాసార్లు ఇలా జరిగిందన్నారు. అయితే 99 శాతం మంది కాంగ్రెస్‌వాదులు నెహ్రూ-గాంధీ కుటుంబీకులను సమర్థించారన్నారు. పార్టీకి ముఖచిత్రంగా ఎవరిని ప్రచారం చేస్తారని ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, నెహ్రూ-గాంధీ కుటుంబం లేనిదే కాంగ్రెస్ శూన్యమని చెప్పారు. వారు లేకపోతే కాంగ్రెస్‌కు గుర్తింపు ఉండేది కాదన్నారు. అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఉంటే, పార్టీ ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఉండేదన్నారు. రాజస్థాన్‌లో జరిగిన దురదృష్టకర సంఘటన (ఎమ్మెల్యేలు ప్రయోగించిన రాజీనామా అస్త్రం)ను నివారించగలిగి ఉండేవారమన్నారు. 


అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నానని చెప్పారు. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వల్ల ఏర్పడిన సంక్షోభంపై తాను ఆమెకు క్షమాపణ చెప్పానని తెలిపారు. 


Updated Date - 2022-09-30T02:12:14+05:30 IST