RSS : ఆరెస్సెస్‌కు దిమ్మదిరిగే ప్రశ్నలు వేసిన దిగ్విజయ్ సింగ్

ABN , First Publish Date - 2022-10-06T18:12:32+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సర్ సంఘ్‌చాలక్

RSS : ఆరెస్సెస్‌కు దిమ్మదిరిగే ప్రశ్నలు వేసిన దిగ్విజయ్ సింగ్

న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సర్ సంఘ్‌చాలక్ పదవిని ఓ మహిళకు ఇస్తారా? అని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్‌ను కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ నిలదీశారు. హిందూ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని వదులుకుంటారా? అని ప్రశ్నించారు. ఓ చిరుత పులి తన శరీరంపైన ఉండే మచ్చలను మార్చుకోగలుగుతుందా? అని వ్యాఖ్యానించారు. 


మోహన్ భాగవత్ (Mohan Bhagwat) దసరా సందర్భంగా బుధవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మహిళల భాగస్వామ్యం లేకపోతే సమాజం ప్రగతి సాధించదని చెప్పారు. మహిళలను సాధికారులను చేయాలన్నారు. 


ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ బుధవారం స్పందిస్తూ, ‘‘ఆరెస్సెస్ మారుతోందా? చిరుత పులి తన శరీరంపైన ఉండే మచ్చలను మార్చుకోగలుగుతుందా? ఆరెస్సెస్ స్వభావంలో మౌలిక మార్పులు చేయాలని వారు కోరుకుంటే, మోహన్ భాగవత్‌కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎజెండాను వదులుకుంటారా? సర్ సంఘ్‌చాలక్‌గా ఓ మహిళను నియమించగలరా? తదుపరి సర్ సంఘ్‌చాలక్‌గా కొంకాస్ట్/చిట్‌పవన్/బ్రాహ్మణ కానివారు కాగలరా? ఓబీసీ/ఎస్‌సీ/ఎస్‌టీ సర్ సంఘ్‌చాలక్ ఆరెస్సెస్‌లోని అన్ని స్థాయులవారికి అంగీకారమేనా? ఆరెస్సెస్‌ను రిజిస్టర్ చేస్తారా? ఆరెస్సెస్ రెగ్యులర్ మెంబర్‌షిప్ ఉంటుందా?’’ అని ప్రశ్నించారు. 


మైనారిటీలకు ఆరెస్సెస్ సభ్యత్వం ఇస్తారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. తన ప్రశ్నలు/సందేహాలకు సకారాత్మకంగా (positively) సమాధానాలు చెబితే, తనకు ఆరెస్సెస్‌తో ఎటువంటి సమస్య ఉండదని తెలిపారు. ‘‘మోహన్ భాగవత్ గారూ, మీరు వీటన్నిటినీ చేస్తే, నేను మీ మద్దతుదారును అయిపోతాను’’ అన్నారు. 


మోహన్ భాగవత్ బుధవారం దసరా సందర్భంగా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో, మహిళా సాధికారత, జనాభా విధానం, జనాభా అసమతుల్యత వంటి అంశాలపై మాట్లాడారు. 


Updated Date - 2022-10-06T18:12:32+05:30 IST