Prime Minister Modi : ఉచితాలతో ఆర్థిక వ్యవస్థ నాశనం

ABN , First Publish Date - 2022-12-12T05:38:42+05:30 IST

దేశానికి షార్ట్‌కట్‌ రాజకీయాలు అక్కర్లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భవిష్యత్‌ దృష్టితో సమగ్రాభివృద్ధి అవసరమని నొక్కిచెప్పారు. కొన్ని పార్టీలు ఉచిత పథకాల పేరుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

Prime Minister Modi : ఉచితాలతో ఆర్థిక వ్యవస్థ నాశనం

కొన్ని పార్టీలవి షార్ట్‌కట్‌ రాజకీయాలు.. తప్పుడు హామీలతో గద్దెనెక్కుతున్నారు

వారితో అప్రమత్తంగా ఉండాలి: మోదీ

మహారాష్ట్రలో రూ.75 వేల కోట్ల ప్రాజెక్టులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు

నాగపూర్‌, డిసెంబరు 11: దేశానికి షార్ట్‌కట్‌ రాజకీయాలు అక్కర్లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భవిష్యత్‌ దృష్టితో సమగ్రాభివృద్ధి అవసరమని నొక్కిచెప్పారు. కొన్ని పార్టీలు ఉచిత పథకాల పేరుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో రూ.75 వేల కోట్లతో చేపట్టిన 11 ప్రాజెక్టులకు ఆదివారమిక్కడ ఆయన భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. ‘గత ఎనిమిదేళ్లుగా మైండ్‌సెట్‌ మార్చి ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ అనే దృక్పథంతో పనిచేస్తున్నాం. కొందరు నేతలు షార్ట్‌కట్‌ రాజకీయాలు చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును లూటీ చేస్తున్నారు. తప్పుడు హామీలతో అధికారాన్ని కైవసం చేసుకుంటున్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. షార్ట్‌కట్‌ రాజకీయాలొద్దని నేతలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల ఐక్యబలం, పురోగతి, అభివృద్ధి ద్వారా మాత్రమే ‘పురోగామి భారతం’ వాస్తవ రూపం దాల్చుతుందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ఇవాళ సంకష్ట చతుర్థి అని, అన్ని మంచి పనులూ విఘ్నేశ్వరుడికి పూజలు చేసి ప్రారంభిస్తామని మరాఠీలో ప్రసంగం ప్రారంభిస్తూ చెప్పారు. ‘టేక్‌డీ గణపతి బొప్పాకు జై’ అని నినదించారు. కాగా.. నాగపూర్‌తో షిర్డీని అనుసంధానించే నాగపూర్‌-ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రె్‌సవే తొలి దశను, నాగపూర్‌ మెట్రో రైలు తొలి దశను ఆయన ప్రారంభించారు. నాగపూర్‌-బిలా్‌సపూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పచ్చజెండా ఊపారు. అలాగే ఇక్కడ ఎయిమ్స్‌ను కూడా ప్రారంభించారు. నాగపూర్‌, అజ్నీ రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు.

మళ్లీ ఆయుర్వేదం బాటలో ప్రపంచం

వివిధ రకాల వైద్య చికిత్సలను ప్రయత్నించి ప్రపంచం.. ఇప్పుడు క్రమంగా తిరిగి ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేద చికిత్సల వైపు మొగ్గుతోందని ప్రధాని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకున్న ఆయన.. 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్‌, ఆరోగ్య ఎక్స్‌పోలో ముగింపు ప్రసంగం చేశారు. గోవాలో ఏర్పాటు చేసిన అఖిల భారత ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌, ఘజియాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునానీ మెడిసిన్‌, ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి సంస్థలను వర్చువల్‌గా ప్రారంభించారు. 30కి పైగా దేశాలు ఆయుర్వేదాన్ని సంప్రదాయ వైద్య విధానంగా అంగీకరించడంపై మోదీసంతృప్తి వ్యక్తంచేశారు. గత ఎనిమిదేళ్లలో ఆయుష్‌ పరిశ్రమ రూ.20 వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు చేరుకుందన్నారు. ఔషధ మొక్కల పెంపకంతో లబ్ధి పొందడానికి ప్రయత్నించాలని సూచించారు.

స్వయంగా టికెట్‌ కొని మెట్రో ఎక్కిన మోదీ

ప్రధాని క్యూలో నిల్చుని టికెట్‌ కొని మరీ నాగపూర్‌లో మెట్రో రైలెక్కారు. జీరో మైల్‌ ఫ్రీడం పార్కు నుంచి ఖాప్రీ స్టేషన్‌ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా కొందరు ఎయిమ్స్‌ విద్యార్థులతోను, రైలెక్కిన స్థానికులతోను ఆయన ముచ్చటించారు. సమృద్ధి ఎక్స్‌ప్రె్‌సవే (హిందూ హృదయ సామ్రాట్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌) పొడవు 710 కిలోమీటర్లు. మొదటి దశలో 520 కి.మీ. రోడ్డును పూర్తిచేశారు. అంతకుముందు మహారాష్ట్ర ‘ధోల్‌’ కళాకారుల విన్యాసాలతో ఆయనకు సంప్రదాయబద్ధమైన స్వాగతం లభించింది. ఓ కళాకారుడి చెంతకు వెళ్లి అతడి వద్ద ఉన్న ధోల్‌ను తాను వాయించడం విశేషం. ఆ వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Updated Date - 2022-12-12T05:38:42+05:30 IST

Read more