Punjab: ప్రభుత్వాసుపత్రి నిర్వాకంతో నేలపైనే ప్రసవించిన మహిళ

ABN , First Publish Date - 2022-10-01T01:33:01+05:30 IST

పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ నిండు గర్భిణి కటికనేలపైనే ..

Punjab: ప్రభుత్వాసుపత్రి నిర్వాకంతో నేలపైనే ప్రసవించిన మహిళ

పఠాన్‌కోట్: పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ నిండు గర్భిణి కటికనేలపైనే ప్రసవించింది. ప్రభుత్వాసుపత్రి వార్డులో ఆమెకు పడక కేటాయించకపోవడంతో అక్కడి ఫ్లోర్‌పైనే ఆమె ప్రసవించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో రావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో పంజాబ్ సర్కార్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. నిర్లక్ష్యంతో వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేసింది.


''భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం తమది 'వరల్డ్ క్సాప్ హెల్త్ మోడల్' అని చెప్పుకుంటుంది. ప్రకటనలపై డబ్బులు ఖర్చు చేస్తారు. పేద ప్రజల  బాధలు మాత్రం పట్టవు'' అని బీజేపీ నేత షెహజాద్ పూనావాల్ ఓ ట్వీట్‌లో విమర్శించారు. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలోనూ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఏమీ లేదని, మోహల్లా క్లినిక్‌లు అలా ఉంచితే..వరల్డ్ క్లాస్ ఆసుపత్రులేవీ? అని మరో ట్వీట్‌లో ఆయన ప్రశ్నించారు.


కాగా, నిండుగర్భిణి ఆసుపత్రి నేలపైనే ప్రసవించిన వార్త దావానలం కావడంతో పఠాన్‌కోట్ డిప్యూటీ కమిషనర్ హర్బీర్ సింగ్ వెంటనే చర్యలకు దిగారు. ఘటనకు సంబంధించిన వివరాలను సివిల్ సర్జిన్‌ను అడిగి తెలుసుకున్నారు. ''సర్జన్‌ను వివరాలు అడిగాను. ఆయన చెప్పిన సమాధానాలు సంతృప్తిగా లేవు. ఒక మహిళ ఆసుపత్రిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె జాగ్రత్తలు చూసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రిదే. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాను. నిందితులపై చర్యలు తీసుకుంటాం'' అని హర్బీర్ సింగ్ తెలిపారు. అయితే, ఆసుపత్రి వైద్యులు చెబుతున్న దానికి, అక్కడి మహిళలు (పేషెంట్లు) చెబుతున్న దానికి పొంతన కనిపించడంలేదని  చెప్పారు.


సీఎంకు సన్నీడియోల్ లేఖ

కాగా, తాజా ఘటనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీ డియోల్ లేఖ రాశారు. పేషెంట్ల జీవితాలతో ఆడుకుంటున్న బాధ్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎంను సన్నీ డియోల్ కోరారు. తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వాసుపత్రుల తీరు ఇలా ఉండటం సిగ్గుచేటని, దీనిని సీరియస్‌గా తీసుకుని బాధ్యలైన వారిపై కేసు నమోదు చేస్తే తాను రుణపడి ఉంటాడని డియాల్ ఆ లేఖలో సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-10-01T01:33:01+05:30 IST