Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ‘కనిక’ట్టు

ABN , First Publish Date - 2022-11-17T04:32:56+05:30 IST

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో లింకు బయటపడింది! ఈ స్కామ్‌లో డబ్బు హవాలా మార్గంలోనే కాక..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో  ‘కనిక’ట్టు

అక్రమ సొమ్ము ‘జెట్‌ సెట్‌గో’..

శరత్‌చంద్రా రెడ్డి భార్య కనికకు చెందిన చార్టర్డ్‌ విమానాల్లోనే డబ్బు తరలింపు!

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి పలుచోట్లకు

పెద్ద ఎత్తున పంపినట్లు ఈడీకి ఆధారాలు?

ఆ సంస్థ విమానాల ప్రయాణ వివరాలివ్వండి

ఏఏఐ చైర్మన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లేఖ

ఒక్కరోజు వ్యవధిలోనే వివరాలు పంపిన ఏఏఐ

తెలుగురాష్ట్రాల నేతలతో కనికారెడ్డికిసంబంధాలు

ఢిల్లీ స్థాయిలోనూ కీలక నేతలతో పరిచయాలు

ఆమె కంపెనీ విమానాల్లో ప్రముఖుల ప్రయాణాలు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన

మరికొందరు నేతల పాత్రపై ఈడీ, సీబీఐ దర్యాప్తు

న్యూఢిల్లీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో లింకు బయటపడింది! ఈ స్కామ్‌లో డబ్బు హవాలా మార్గంలోనే కాక.. బేగంపేట విమానాశ్రయం నుంచి ‘హవా’ (విమాన) మార్గంలో కూడా దేశంలోని పలుప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిపోయినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైందని తెలుస్తోంది! ఈ వాయురవాణా వెనుక కీలక సూత్రధారి మరెవరో కాదు..! ఇటీవలే ఈడీ అరెస్టు చేసిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి భార్య, జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ సంస్థ వ్యవస్థాపకురాలు కనికా టెక్రివాల్‌ రెడ్డి అని ఈడీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె సంస్థకు చెందిన చార్టర్డ్‌ విమానాల్లోనే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు నగదును తరలించారని నిరూపించే ప్రాథమిక ఆధారాలు ఈడీకి లభ్యమైనట్టు తెలిసింది.

దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల తరహాలో.. బేగంపేట విమానాశ్రయంలో స్ర్కీనింగ్‌ పాయింట్లు లేకపోవడం, వీఐపీల వాహనాలు నేరుగా రన్‌వేపై విమానాల దగ్గరి దాకా వెళ్లే వీలుండడం వంటి వెసులుబాట్లను ఇందుకు ఉపయోగించుకున్నట్లు ఈడీ భావిస్తోంది. ఈ మేరకు ఆధారాల కోసం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ రాబిన్‌ గుప్తా గత నెల 17న రాసిన లేఖ ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘‘దేశంలో ప్రైవేటు జెట్‌చార్టర్డ్‌ సేవలు అందిస్తున్న జెట్‌సెట్‌ గో ఏవియేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు చెందిన డాక్యుమెంట్లు, సమాచారం అత్యవసరంగా కావాలి. కంపెనీ ఏర్పాటు చేసిన తేదీ నుంచి ఇప్పటి వరకూ ఆ సంస్థ విమానాల ఆపరేషన్ల పూర్తి వివరాలు, ఆ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారన్న వివరాలు, ఆ కంపెనీ మేనేజర్ల వివరాలు అందించండి’’ అని లేఖలో రాబిన్‌ గుప్తా పేర్కొన్నారు. ఏఏఐ ఆ లేఖను చెన్నై, హైదరాబాద్‌ సహా దేశంలోని అన్ని విమానాశ్రయాల డైరెక్టర్లకూ పంపించి, వివరాలను సేకరించి ఆ మరుసటి రోజే ఈడీకి అందించినట్లు సమాచారం.

ఏఏఐ అప్రమత్తం..

ఈడీ నుంచి లేఖ రావడంతో ఏఏఐ అప్రమత్తమైంది. బేగంపేట విమానాశ్రయం నుంచి నగదు తరలించినట్లు ఈడీకి ప్రాథమిక ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో అక్కడి నుంచి ప్రైవేటు చార్టర్డ్‌ విమానాల రాకపోకలపై ఏఏఐ నిషేధం విధించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రొటోకాల్‌ కలిగిన అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ప్రయాణించడానికి తప్ప.. మరెవ్వరికీ అక్కడ అనుమతులివ్వడం లేదని తెలిసింది. ప్రైవేటు విమానాలను శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అనుమతిస్తున్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌ చంద్రా రెడ్డి భార్య అయిన కనికకు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలతోపాటు, ఢిల్లీ స్థాయిలోనూ కీలక నేతలతో పరిచయాలు ఉన్నట్లు సమాచారం. విజయసాయి రెడ్డి సహా రెండు రాష్ట్రాలకు చెందిన చాలామంది రాజకీయ నేతలు, ప్రముఖులు ఆమె చార్టర్డ్‌ విమానాల్లో పలు ప్రాంతాలకు వెళ్లినట్లు ఈడీ నిర్ధారించుకుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆ ప్రముఖల అండతోనే బేగంపేట విమానాశ్రయం నుంచి విమానాల్లో నగదును తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరింత మంది రాజకీయ నేతల పాత్రపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేసే అవకాశమున్నట్లు సమాచారం.

కేన్సర్‌ను జయించి.. వ్యాపారవేత్తగా..

జెట్‌ సెట్‌ గో.. ఓలా, ఉబెర్‌ తరహాలో దేశంలో చార్టర్డ్‌ విమానాల సేవలను అందించే సంస్థ! మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ పట్టణంలో ఓ మార్వాడీ కుటుంబంలో పుట్టిపెరిగిన కనికా టెక్రివాల్‌ కల ఈ కంపెనీ! 22 ఏళ్ల వయసులో.. క్యాన్సర్‌ను జయించి మరీ ఆమె స్థాపించిన సంస్థ ఇది. ‘ఉబెర్‌ ఆప్‌ ద స్కైస్‌’గా పేరొందిన కంపెనీ. భోపాల్‌లో పుట్టినప్పటికీ.. తొమ్మిదో తరగతి దాకా కనిక విద్యాభ్యాసం ఊటీలోని లారెన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగింది. పదో తరగతి సమయానికి తల్లిదండ్రులు ఆమెను భోపాల్‌కు తీసుకొచ్చేశారు. అక్కడే ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన కనిక.. ముంబైలో విజువల్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. లండన్‌లోని కొవెంట్రీ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అయితే.. కాలేజీలో ఉండగానే ఆమె ఏరోస్పేస్‌ రీసోర్సె్‌సలో పనిచేశారు. ఒకదశలో పైలట్‌ కావాలనుకున్నారు. కానీ, భారతదేశంలో చార్టర్డ్‌ విమానాల మార్కెట్‌కు ఉన్న విస్తృతిని గుర్తించి ఈ రంగంలోకి రావాలనుకున్నారు. 2011లో భారత్‌కు తిరిగి వచ్చి.. తల్లిదండ్రులకు చెప్తే వాళ్లు ఒప్పుకోలేదు. అదే సమయంలో ఆమె హాడ్గ్‌కిన్స్‌ లింఫోమా (లింఫాటిక్‌ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్‌) బారిన పడ్డారు. అయినా వెనకడుగు వేయలేదు. దానికి చికిత్స తీసుకుని దాన్నుంచి బయటపడి ఢిల్లీకి వెళ్లి 2014లో జెట్‌ సెట్‌ గో కంపెనీని ప్రారంభించారు. తన మాట వినకపోవడంతో కనికతో ఆమె తండ్రి కొన్నాళ్లపాటు మాట్లాడ్డం కూడా మానేశారు. అయినా ఆమె తాను అనుకున్న దారిలో ముందుకే సాగారు.

Updated Date - 2022-11-17T04:32:57+05:30 IST