delhi excise scam: కీలక పరిణామం.. సిసోడియాపై మనీలాండరింగ్ కేసు పెట్టిన ఈడీ

ABN , First Publish Date - 2022-08-24T01:52:50+05:30 IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం స్కామ్‌లోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఎంటరైంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది.

delhi excise scam: కీలక పరిణామం.. సిసోడియాపై మనీలాండరింగ్ కేసు పెట్టిన ఈడీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం స్కామ్‌లోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఎంటరైంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది.  






మరోవైపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. మాజీ ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపి కృష్ణను, మాజీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  


మరోవైపు ఇప్పటికే ఈ మద్యం స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు  దాడులు నిర్వహించారు.


గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది. దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. 


మరోవైపు ఢిల్లీ మద్యం స్కామ్‌తో సంబంధం ఉందంటూ తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జ్ ముందు ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధార ఆరోపణలతో ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని పిటిషన్‌లో తెలిపారు. ప్రజల్లో తనకు ఉన్న మంచి పేరును, ప్రతిష్టను చెడగొట్టడానికి అక్రమ పద్ధతులను వారు ఎంచుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్  చేసిన ప్రకటనల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదని, తనకు వారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేయాలని కవిత కోర్టును కోరారు. 

Updated Date - 2022-08-24T01:52:50+05:30 IST