Religious event row: పోలీసుల ముందు హాజరైన ఢిల్లీ మాజీ మంత్రి

ABN , First Publish Date - 2022-10-11T22:37:47+05:30 IST

బౌద్ధంలోకి మతమార్పిడి జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని హిందూ దేవుళ్లను పూజించేది లేదంటూ ప్రతిన చేసి వివాదంలో ..

Religious event row: పోలీసుల ముందు హాజరైన ఢిల్లీ మాజీ మంత్రి

న్యూఢిల్లీ: బౌద్ధంలోకి మతమార్పిడి జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని హిందూ దేవుళ్లను పూజించేది లేదంటూ ప్రతిన చేసి వివాదంలో చిక్కిన ఆప్ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ (Rajenda pal Gautam) మంగళవారంనాడు ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ వివాదంలో తన మంత్రిపదవికి రెండ్రోజుల క్రితమే గౌతమ్ రాజీనామా చేశారు. మతమార్పిడి కార్యక్రమంలో మంత్రి హాజరుకు సంబంధించిన విషయమై ప్రశ్నించేందుకు ఢిల్లీ పోలీసులు ఆయనకు సమన్లు పంపారు. దీంతో మధ్యాహ్నం 2.30  గంటల ప్రాంతంలో ఆయన పహర్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు.


''అంబేద్కర్ భవన్‌లో జరిగిన ఈవెంట్‌కు సంబంధించి మాకు అందిన ఫిర్యాదు మేరకు విచారణకు రాజేంద్ర పాల్ గౌతమ్‌ని రమ్మని పిలిచాం. ఇది సాధారణ విచారణే'' అని ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ డీసీపీ శ్వేత చౌహాన్ తెలిపారు.


శనివారంనాడు ఢిల్లీలో జరిగిన సామూహిక మతమార్పిడి కార్యక్రమంలో మాజీ మంత్రి  చేసిన వ్యాఖ్యల వీడియో ఇటీవల కలకలం సృష్టించింది. ''బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మీద కానీ, ఆ ముగ్గురి ఆరాధనపై కానీ నాకు నమ్మకం లేదు'' అని తన ప్రతినలో గౌతమ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మంత్రి మతపరమైన విభజనకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం హిందూ వ్యతిరేకిగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో గత ఆదివారంనాడు తన మంత్రి పదవికి గౌతమ్ రాజీనామా  చేశారు. తన వల్ల తన పార్టీ కానీ , అరవింద్ కేజ్రీవాల్‌ కానీ ఇబ్బందుల్లో పడకూడదని ఆయన అన్నారు. తాను పాల్గొన్నది మతపరమైన కార్యక్రమమే కానీ, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారంనాడు ఆయనకు ఢిల్లీ పోలీసులు నేరుగా సమన్లు అందజేశారు.

Read more