12 వేల స్మార్ట్ క్లాస్‌రూములను ప్రారంభించిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-02-19T21:47:07+05:30 IST

దేశంలోని అవినీతిపరులంతా కలిశారని, అత్యాధునిక తరగతి

12 వేల స్మార్ట్ క్లాస్‌రూములను ప్రారంభించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ : దేశంలోని అవినీతిపరులంతా కలిశారని, అత్యాధునిక తరగతి గదులను ప్రారంభించడం ద్వారా ఆ అవినీతిపరులందరికీ దీటైన సమాధానం ఇచ్చానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం ఆయన 240 ప్రభుత్వ పాఠశాలల్లో 12,430 స్మార్ట్ క్లాస్‌రూములను ప్రారంభించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా, రాష్ట్ర హోం మంత్రి సత్యేందర్ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఈ తరగతి గదులను ప్రారంభించడానికి ముందు కేజ్రీవాల్ ఇచ్చిన ట్వీట్‌లో, దేశంలోని అవినీతిపరులంతా కలిశారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తగిన తరగతి గదులను ప్రారంభించడం ద్వారా వారందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ దీటైన సమాధానం చెప్పిందని తెలిపారు. అవినీతిపరుల ముందు దేశం తల వంచదని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్  కలలను సాకారం చేయడానికి తాము కృషి చేస్తామన్నారు. 


అవినీతిపరులంతా కలిసి తనను ఉగ్రవాది అంటున్నారని మండిపడ్డారు. నేడు ఆ ఉగ్రవాది ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూములను ప్రారంభించాడన్నారు. అంబేద్కర్, భగత్ సింగ్ కలలను ఆ ఉగ్రవాదే సాకారం చేస్తున్నాడన్నారు. అధికారులు, న్యాయమూర్తులు, రిక్షా నడిపేవారు, కార్మికులు, కూలీల పిల్లలు ఒకే డెస్క్ వద్ద కూర్చుని చదువుకుంటారన్నారు. 


కుమార్ విశ్వాస్ వీడియోతో...

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి (అరవింద్ కేజ్రీవాల్) ఓ స్వతంత్ర దేశానికి ప్రధాన మంత్రి అవాలనుకుంటున్నారన్నారు. ఖలిస్థాన్ దేశంగా ఏర్పడితే తొలి ప్రధాన మంత్రినవాలని కేజ్రీవాల్ అనుకుంటున్నట్లు తెలిపారు. 


‘‘ఆయన (కేజ్రీవాల్) చాలా భయానకమైన విషయాలు చెప్పారు. వీటి గురించి పంజాబ్‌లోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆందోళన చెందవద్దని ఓ రోజు ఆయన నాతో చెప్పారు. ఓ స్వతంత్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. రిఫరెండం 2020 జరుగుతోందని నేను చెప్పాను. రిఫరెండం కోసం పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి నిధులు వస్తున్నాయని, ఇతర వేర్పాటువాద గ్రూపులు కూడా నిధులు సమకూర్చుతున్నాయని చెప్పారు. దీనికి కేజ్రీవాల్ బదులిస్తూ, అయితే ఏంటి? నేను ఓ స్వతంత్ర దేశానికి తొలి ప్రధాన మంత్రిని అవుతానని అన్నారు’’ అని కుమార్ విశ్వాస్ ఈ వీడియోలో పేర్కొన్నారు. 


కల్పిత వీడియో...

దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా స్పందించారు. కుమార్ విశ్వాస్ ఫోర్జరీ చేసి, కల్పిత వీడియోను ప్రదర్శించారని ఆరోపించింది. కేజ్రీవాల్‌ను అపఖ్యాతిపాలు చేయాలన్నదే దీని వెనుక లక్ష్యమని ఆరోపించారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.


Read more