రూ.76,390 కోట్ల రక్షణ కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-06-07T08:32:08+05:30 IST

రక్షణ రంగానికి, దేశీయ తయారీకి మరింత ఊతమిచ్చేలా సుమారు రూ.76,390 కోట్ల విలువైన పరికరాలు

రూ.76,390 కోట్ల రక్షణ కొనుగోళ్లు

డీఏసీ ఆమోదం.. అన్ని కొనుగోళ్లూ దేశీయ సంస్థల నుంచే: రక్షణ శాఖ


న్యూఢిల్లీ, జూన్‌ 6: రక్షణ రంగానికి, దేశీయ తయారీకి మరింత ఊతమిచ్చేలా సుమారు రూ.76,390 కోట్ల విలువైన పరికరాలు, వ్యవస్థల్ని దేశీయ పరిశ్రమల నుంచి సైన్యం కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ సముపార్జన మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. వీటిలో నేవీకి రూ.36వేల కోట్లతో అత్యాధునిక కార్వెట్స్‌(ఎన్‌జీసీ) కొనుగోలు చేయనున్నారు. భారత ప్రాదేశిక జలాల్లో నిఘా కార్యకలాపాలు, సహాయక చర్యలు, సోదాలు-దాడులు, తీరప్రాంత రక్షణ మొదలైన అనేక అవసరాలకు ఎన్‌జీసీలు ఉపకరిస్తాయి. వీటిని నేవీ అవసరాల ప్రకారం, సరికొత్త రూపకల్పనతో అత్యాధునిక సాంకేతికతతో తయారుచేయనున్నారు. డోర్నియర్‌ విమానం, సుఖోయ్‌-30 ఎంకేఐ ఏరో-ఇంజన్ల కొనుగోలుకూ డీఏసీ పచ్చజెండా ఊపింది. ఇక సైన్యానికి ‘రఫ్‌ టెరైన్‌ ఫోర్న్‌ లిఫ్ట్‌’ ట్రక్కులు, బ్రిడ్జి లేయింగ్‌ ట్యాంక్స్‌, యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులతో కూడిన సాయుధ యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్లు తదితర వ్యవస్థలను దేశీయ సంస్థల్లోనే రూపకల్పన, నిర్మాణం చేయించి కొనుగోలు చేయనున్నారు. ‘‘ఈ కొనుగోళ్లతో దేశీయ రక్షణ తయారీ రంగం మరింత బలోపేతమవుతుంది. రక్షణ రంగంలో డిజిటల్‌ మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ‘డిజిటల్‌ కోస్ట్‌ గార్డ్‌’ ప్రాజెక్టుకు డీఏసీ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కోస్ట్‌ గార్డ్‌ ఉపరితల, గగనతల ఆపరేషన్లు, రవాణా, ఆర్థిక, మానవ వనరుల విభాగాలన్నింటి మధ్య అత్యున్నత భద్రతతో కూడిన ఒక డిజిటల్‌ నెటవర్క్‌ను ఏర్పాటు చేయనున్నాం’’ అని రక్షణ శాఖ ప్రకటనలో స్పష్టం చేసింది.

Read more