మృత్యు క్రీడ

ABN , First Publish Date - 2022-10-03T08:58:19+05:30 IST

ఇండోనేసియా ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాటకు ఇద్దరు పోలీసు అధికారులు, అనేకమంది చిన్నారులు సహా 125 మంది బలయ్యారు.

మృత్యు క్రీడ

ఇండోనేసియా ఫుట్‌బాల్‌ స్టేడియంలో తొక్కిసలాట

125 మంది మృతి.. మరో 180 మందికి గాయాలు

మృతుల్లో ఇద్దరు పోలీసులు.. అనేకమంది చిన్నారులు

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

అభిమాన జట్టు ఓటమిని తట్టుకోలేక..

మైదానంలోకి దూసుకొచ్చిన 3 వేల మంది 

క్రీడాకారులు, నిర్వాహకులపై వాటర్‌ బాటిళ్లతో దాడి

లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో పరుగులు

ఇరుకైన ఎగ్జిట్‌ మార్గంలో బీభత్సం


ఇండోనేసియా ఫుట్‌బాల్‌ స్టేడియం మృత్యు ద్వారంగా మారింది. స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 125 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది వరకు గాయాలపాలయ్యారు. అభిమాన జట్టు ఓటమిని తట్టుకోలేక 3 వేల మందికిపైగా ప్రేక్షకులు ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చారు. క్రీడాకారులపైకి నీళ్ల బాటిళ్లు, ఇతర వస్తువులతో 

దాడికి పాల్పడ్డారు. లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో వారంతా ఒక్కసారిగా ఎగ్జిట్‌ మార్గంలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగింది. దేశీయ లీగ్‌ మ్యాచ్‌లోనే ఇంతటి ఘోరం జరగడం గమనార్హం.


జకార్తా, అక్టోబరు 2: ఇండోనేసియా ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాటకు ఇద్దరు పోలీసు అధికారులు, అనేకమంది చిన్నారులు సహా 125 మంది బలయ్యారు. మరో 180 మందికిపైగా గాయాలపాలయ్యారు. తూర్పు జావా ప్రావిన్స్‌లోని తూర్పు మలంగ్‌ నగరంలో శనివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. దీర్ఘకాల ప్రత్యర్థులైన అరేమా మలంగ్‌, పెర్సెబయ సురబయ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా కంజురుహన్‌ స్టేడియంలో ఈ విషాదం జరిగింది. సొంత గడ్డపై అరేమా మలంగ్‌ జట్టు ఓటమి(3-2)ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఒక్కసారిగా 3 వేల మందికిపైగా మైదానంలోకి దూసుకొచ్చి క్రీడాకారులు, నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఒక్కసారిగా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో భయాందోళనకు గురైన ఆందోళనకారులు బయటికి వెళ్లిపోయేందుకు ఒక్కసారిగా ఎగ్జిట్‌ మార్గంలోకి తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించి 34 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించగా కొందరు మార్గం మధ్యలో, మరికొందరు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. స్టేడియం బయట కూడా అభిమానులు ఐదు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో మొత్తం 13 వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు.  టియర్‌ గ్యాస్‌ నుంచి తప్పించుకునేందుకు అనేకమంది మైదానంలోని స్టాండ్లపైకి ఎక్కి అవతలికి దూకిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ‘అక్కడ అల్లర్లు ఏమీ జరగలేదు. అయినా అకస్మాత్తుగా టియర్‌గ్యాస్‌ ఎందుకు ప్రయోగించారో అర్థం కావడంలేదు. పిల్లలు, మహిళలు ఉన్నారనే విషయం కూడా పట్టించుకోలేదు. నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను’ అని డానీ అనే బాధితుడు తెలిపారు. ఘటనపై ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అన్ని ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకూ భద్రతాపరమైన సమీక్షలు నిర్వహించాలని, భద్రతను మెరుగుపరిచే చర్యలు పూర్తయ్యేవరకూ అన్ని మ్యాచ్‌లనూ నిలిపివేయాలని ఆదేశించారు.  


ఆ టీమ్‌ అభిమానులకు టికెట్లు అమ్మలేదు

ఇండోనేసియాలో అత్యధికులు అభిమానించే క్రీడ ఫుట్‌బాల్‌. దేశీయ అరేమా మలంగ్‌, పెర్సెబయ సురబయ జట్లు దీర్ఘకాల ప్రత్యర్థులు. ఈ రెండు జట్ల అభిమానుల మధ్య గతంలో అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. అరేమా మలంగ్‌ జట్టుకు సొంత గడ్డ మలంగ్‌ నగరంలోనే ఈ మ్యాచ్‌ జరగడంతో మళ్లీ ఘర్షణలు జరుగుతాయనే భయంతో పెర్సెబయ సురబయ జట్టు అభిమానులకు ఈ మ్యాచ్‌ టికెట్లను విక్రయించలేదని నిర్వాహకులు తెలిపారు.  


వారం పాటు మ్యాచ్‌ల నిలిపివేత..

ఘటన నేపథ్యంలో ఇండోనేసియాలోనే టాప్‌ లీగ్‌ ఫుటబాల్‌ మ్యాచ్‌లు బీఆర్‌ఐ లిగా-1ను ఇండోనేసియా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(పీఎ్‌సఎ్‌సఐ) వారం పాటు నిలిపివేసింది. ప్రస్తుత సీజన్‌ ముగిసే వరకు అరేమా సాకర్‌ క్లబ్‌ సొంత గడ్డపై మ్యాచ్‌లకు అతిథ్యం ఇవ్వకుండా పీఎ్‌సఎ్‌సఐ నిషేధం విధించింది. సాకర్‌ స్టేడియంలలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(ఫిఫా) నిషేధించినప్పటికీ టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించడంపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఆమ్నెస్టీ డిమాండ్‌ చేసింది.  


సామర్థ్యం 38 వేల మంది.. టికెట్లు 42 వేలు..

స్టేడియం సామర్థ్యం 38 వేల మంది కాగా, 42 వేల టికెట్లు విక్రయించారని ఇండోనేసియా భద్రతా శాఖ మంత్రి మొహమ్మద్‌ మహఫూజ్‌ ఆరోపించారు. 38 వేల టికెట్లు మాత్రమే ముద్రించాలని ప్రభుత్వం సూచించినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారన్నారు. రాత్రికి బదులు మధ్యాహ్నమే మ్యాచ్‌ నిర్వహించాలని ప్రభుత్వం సూచించినా పట్టించుకోలేదని తప్పుబట్టారు. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం విషాదాల్లో ఒకటిగా తూర్పు జావా డిప్యూటీ గవర్నర్‌ ఎమిల్‌ దర్డక్‌ అభివర్ణించారు.

Read more