Jammu and Kashmir: అధికరణ 370 రద్దు తర్వాత దళితులు, బీసీలకు రిజర్వేషన్ ఫలాలు : అమిత్ షా

ABN , First Publish Date - 2022-10-04T20:04:17+05:30 IST

జమ్మూ-కశ్మీరు (Jammu & Kashmir)కు ప్రత్యేక హోదా

Jammu and Kashmir: అధికరణ 370 రద్దు తర్వాత దళితులు, బీసీలకు రిజర్వేషన్ ఫలాలు : అమిత్ షా

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు (Jammu & Kashmir)కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత దళితులు, వెనుకబడిన తరగతులు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)  చెప్పారు. పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న రాజౌరీ జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 


అధికరణ 370ని రద్దు చేస్తే, రక్తపాతం తప్పదని చాలా మంది హెచ్చరించారని, అలాంటివారికి సమాధానం నేటి సభ, మోదీ-మోదీ అంటూ మీరు చేస్తున్న నినాదాలేనని తెలిపారు. జమ్మూ-కశ్మీరును మూడు కుటుంబాలే పరిపాలించేవని, కానీ ఇప్పుడు పంచాయతీలు, జిల్లా కౌన్సిళ్ళకు ఎన్నికైన 30,000 మంది చేతులకు అధికారం వచ్చిందని చెప్పారు. 


అంతకుముందు అమిత్ షా మాతా వైష్ణో దేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఆయనతోపాటు ఉన్నారు. 


అమిత్ షా మంగళవారం నుంచి మూడు రోజులపాటు జమ్మూ-కశ్మీరులో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాజౌరీలో బహిరంగ సభ నేపథ్యంలో జమ్మూ, రాజౌరీ జిల్లాల్లో మొబైల్ డేటా సర్వీసెస్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. మొబైల్ సేవలను దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 


Updated Date - 2022-10-04T20:04:17+05:30 IST