వంట గ్యాస్‌ మంట

ABN , First Publish Date - 2022-03-23T06:49:30+05:30 IST

‘పెట్రో’ బాదుడు మొదలైంది. సామాన్యులపై గ్యాస్‌ ‘బండ’ పడింది. దేశంలో 137 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్‌ ధరలకూ రెక్కలొచ్చాయి....

వంట గ్యాస్‌ మంట

సిలిండర్‌పై రూ.50 పెంపు.. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు 80 పైసలు..

నాలుగున్నర నెలల తర్వాత పెంపు మొదలు

పెట్రోలు, డీజిల్‌పై ఇక రోజూ బాదుడే?

రోజూ రూ.1లోపు పెంచే అవకాశం..?

నష్టాలు పూడ్చుకునేందుకు లీటరుకు రూ.25 దాకా పెంచాలంటున్న కంపెనీలు..!

పెట్రో ధరల పెంపుపై మండిపడ్డ ప్రతిపక్షాలు

లోక్‌సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్‌

రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన

ధరల పెంపును ఉపసంహరించాలని డిమాండ్‌


న్యూఢిల్లీ, మార్చి 22: ‘పెట్రో’ బాదుడు మొదలైంది. సామాన్యులపై గ్యాస్‌ ‘బండ’ పడింది. దేశంలో 137 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్‌ ధరలకూ రెక్కలొచ్చాయి. గత అక్టోబరులో చివరిసారిగా పెరిగిన వంట గ్యాస్‌ ధర మంగళవారం రికార్డు స్థాయిలో పెరిగింది. చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 పెంచాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశంలోని చమురు కంపెనీలు గత నవంబరు 4 నుంచి పెట్రో ధరలను పెంచలేదు. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ధరలు పెంచేస్తారని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ పేర్కొన్నాయి. కానీ, చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచలేదు. 10 రోజుల తర్వాత మంగళవారం నుంచి మళ్లీ బాదుడు మొదలైంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో, వాణిజ్య రాజధాని ముంబైలో 14.2 కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.949.50కు చేరింది. కోల్‌కతాలో రూ.976కు చేరుకుంది. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.1002కు చేరింది. చివరిసారిగా గత ఏడాది అక్టోబరు 6న ఎల్పీజీ సిలిండర్‌ ధరను సవరించారు. 


మోదీని అడిగితే.. పళ్లేలు వాయించమంటారు!: రాహుల్‌ 

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘గ్యాస్‌, డీజిల్‌, పెట్రోలుపై విధించిన లాక్‌డౌన్‌ను తొలగించారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం మహమ్మారిపై ప్రధాని మోదీని ప్రశ్నిస్తే.. అందరినీ పళ్లేలు వాయించమని చెబుతారు’’ అని మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక పెట్రో ధరల పెంపుపై ఎన్సీపీ కూడా మండిపడింది. రష్యా నుంచి అత్యధిక డిస్కౌంట్‌తో ముడి చమురును దిగుమతి చేసుకునేటప్పుడు పెట్రో ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఎన్సీపీ నేత మహేశ్‌ తాపసే ప్రశ్నించారు. బీజేపీని గెలిపించడంతో వడ్డీతో సహా వసూలు చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. 


చమురు ధరలు పెరిగితే వారిదే బాధ్యత: సౌదీ అరేబియా

దుబాయి, మార్చి 22: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగితే అందుకు తమ బాధ్యత లేదని సౌదీ అరేబియా ప్రకటించింది. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదార్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. తిరుగుబాటుదార్లు ఆదివారం ఎర్ర సముద్ర తీరంలో ఉన్న యాన్బూ పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్‌పై దాడి చేశారు. ఈ కారణంగా రోజుకు 4 లక్షల బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా సోమవారం ముడిచమురు ధర 4 శాతం మేర పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 112 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా సౌదీలోని చమురు క్షేత్రాలపై దాడుల కారణంగా ఉత్పాదన తగ్గడంతో దాని ప్రభావం ధరలపై కనిపించనుంది.


గత ఏడాది జులై, అక్టోబరు 6 మధ్యలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.100 మేరకు పెంచేశారు. నెలవారీ ధరల సవరణపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. 2020, మే నుంచి నేరు గా ఎల్పీజీ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని కేంద్రం నిలిపివేసిం ది. రవాణా చార్జీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం నామమాత్రపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చే స్తోంది. మరోవైపు ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రో లు, డీజిల్‌పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.96.21కు, డీజిల్‌ రూ.87.47కు చేరుకునాఆ్నయ. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.10, డీజిల్‌ ధర రూ.95.50కు చేరుకుంది. ఇక పెట్రోలు, డీజిల్‌ ధరలను నవంబరు 4 తర్వాత పెంచలేదు. పైగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కొంత మేర ఉపశమనం కల్పించింది. పెట్రోల్‌పై రూ.5(పన్నులు కలుపుకొని రూ.6), డీజిల్‌పై రూ.10(పన్నులు కలుపుకొని రూ.12) మేర తగ్గించింది. 


రెండు నెలలుగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో పలు దేశాల్లో పెట్రోమంటలు తీవ్రమైనా ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు పెంచలేదు. వాస్తవానికి చము రు సంస్థలకు కలిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి పెట్రో ఉత్పత్తులపై లీటరుకు రూ.25 చొప్పున పెంచాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పారిశ్రామిక వినియోగదారులు బల్క్‌గా తీసుకునే డీజిల్‌ ధరను ఇప్పటికే లీటరుకు రూ.25 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న భారత్‌ ముడి చమురును బ్యారెల్‌ 128.24 డాలర్ల చొప్పున కొనుగోలు చేసిందని చమురు శాఖ వెల్లడించింది. ఈ లెక్కన నాలుగున్నర నెలల్లో సగటున బ్యారెల్‌ 81.5 డాలర్లుగా ఉందని, అయినా.. చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచలేదని తెలిపింది. చమురు సంస్థలు నష్టం మొత్తాన్నీ ఒకేసారి పూడ్చుకోవాలని చూడడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రోజూ రూపాయి కంటే తక్కువగా పెంచుతూ నష్టాల నుంచి గట్టెక్కాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి. అంటే ఇకపై ప్రజలకు రోజువారీ బాదుడు తప్పదన్నమాట!


పార్లమెంటులో పెట్రో రగడ

పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రె్‌సపక్ష నేత అధీర్‌రంజన్‌ చౌధరి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో ధరలు పెంచేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, వామపక్ష సభ్యులు ధరల పెంపును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుపట్టగా.. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్‌ ఓం బిర్లా సూచించారు. పెట్రో ధరల పెంపు ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌, టీఎంసీ, వామపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.


ప్లకార్డులు ప్రదర్శించారు. 12 రోజుల పాటు నిరాటంకంగా జరిగిన సభను మంగళవారం విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా తొలిసారి ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా వేయాల్సి వచ్చింది. ‘‘దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1000 చేయాలన్న టార్గెట్‌ చేరుకున్నందుకు ప్రధాని మోదీకి అభినందనలు. ఇక పెట్రోలు, డీజిల్‌ ధరల్లోనూ రోజువారీ ‘వికాసం’ ఉంటుంది. మోదీ హయాంలో అందుబాటులో ఉండేవి మతతత్వం, విద్వేషాలే. మిగిలినవన్నీ చాలా ఖరీదైనవి’’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. బీజేపీ సర్కారు నుంచి మరో కానుక అందిందని, లఖ్‌నవూలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1000కి చేరువైందని ఎస్పీ నేత అఖిలేశ్‌ చెప్పారు. ‘ఎన్నికలు ముగిశాయి. ధరల పెంపు మొదలైంది’ అని పేర్కొన్నారు. 


లంకలో పెట్రోలు బంకుల వద్ద సైనికులు!

శ్రీలంకలో పెట్రో సంక్షోభం రోజురోజుకూ ముదిరిపోతోంది. జనం భారీగా క్యూలు కడుతున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వరంగ పెట్రోలు బంకుల వద్ద సైనిక సిబ్బందిని మోహరించినట్లు లంక ఇంధన శాఖ మంత్రి గామిని లొకుగె చెప్పారు. సైనికులు ప్రజలందరికీ పెట్రోలు, డీజిల్‌ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Read more