రఘురామపై కస్టడీ హింస.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చండి

ABN , First Publish Date - 2022-09-08T08:18:25+05:30 IST

తన తండ్రి, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ సీఐడీ పోలీసుల కస్టోడియల్‌ టార్చర్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

రఘురామపై కస్టడీ హింస.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చండి

అప్పుడు పిటిషన్‌ను పరిశీలిస్తాం.. ఎంపీ కుమారుడికి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): తన తండ్రి, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ సీఐడీ పోలీసుల కస్టోడియల్‌ టార్చర్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లో సంబంధిత అప్లికేషన్‌ను దాఖలు చేయాలని, ఆ తర్వాత పరిశీలిస్తామని స్పష్టం చేసింది. బుధవారం ఈ అంశంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సీటీ రవి కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి ఎందుకు తొలగించారని ప్రశ్నించింది. కస్టడీ టార్చర్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేదని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది బైరపనేని సుయోధన్‌ తెలిపారు. అసలు కేసు దర్యాప్తు చేస్తున్నది ఏపీ పోలీసులే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. టార్చర్‌కు పాల్పడింది వారే కాబట్టి వారి వాదనలు వినాల్సిన అవసరం లేదని ఆదినారాయణరావు బదులిచ్చారు. హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ధర్మాసనం అడుగగా.. రఘురామ అరెస్టు కేసు అప్పటికే సుప్రీంకోర్టుకు చేరిందని, అందుకే నేరుగా ఇక్కడికే వచ్చామని సీనియర్‌ న్యాయవాది సమాధానమిచ్చారు. అయితే ఈ పిటిషన్‌లో తాము జోక్యం చేసుకోబోమని, పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. అందుకు ఆదినారాయణరావు అంగీకరించలేదు. ఎంపీగా ఉన్న రఘురామరాజును రాష్ట్రానికి రానివ్వడం లేదని, నియోజకవర్గంలో తిరగనివ్వడం లేదని, ఇటీవల ప్రధాని పర్యటనలో కూడా పాల్గొననివ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో.. రాష్ట్రప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి రావాలని.. అప్పుడు పిటిషన్‌ను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.

Updated Date - 2022-09-08T08:18:25+05:30 IST