రాణా దంపతులకు 14 రోజుల రిమాండ్

ABN , First Publish Date - 2022-04-24T20:11:36+05:30 IST

అమ్రావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ...

రాణా దంపతులకు 14 రోజుల రిమాండ్

ముంబై: అమ్రావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సండే (హాలిడే) కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై రాణా దంపతులను శనివారం సాయంత్రం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ''మాతోశ్రీ'' నివాసం వద్ద హనుమాన్ చాలీసా పఠనం చేస్తామంటూ రాణా దంపతులు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో రాణా దంపతులకు నోటీసులిచ్చిన పోలీసులు అనంతరం అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 153(ఎ), ముంబై పోలీస్ చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఐపీసీ 353 కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టు అనంతరం శాంతాక్రుజ్ పోలీస్ లాకప్‌లో వీరిని శనివారం రాత్రి ఉంచినట్టు తెలుస్తోంది. కాగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాణా దంపతుల న్యాయవాది రిజ్వాన్ మర్చింట్ బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు.


దీనికి ముందు, హనుమాన్ జయంతి నాడు శివసేన సుప్రీం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలంటూ రవిరాణా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆ విధంగా చేయకుంటే తాను మాతోశ్రీ వెళ్లి హనుమన్ చాలీసా పఠనం చేస్తానని అన్నారు. తాను మాతోశ్రీ వెళ్తున్నట్టు శనివారంనాడు ఆయన ప్రకటించారు. దీంతో శివసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. సబర్బన్ ఖర్‌లోని రాణా దంపతుల నివాసాన్ని దిగ్బంధించారు. తమకు దేవాలయం వంటి మాతోశ్రీని అవమానించినందుకు క్షమాపణ చెప్పేంతవరకూ అక్కడ్నించి కదిలేది లేదని కార్యకర్తలు పట్టుబట్టారు. బారికేడ్లు దాటుకుని భవంతిలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు నిలువరించారు. అనంతరం, రాణా దంపతులు తమ ప్లాన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రధాని ఆదివారంనాడు ముంబై రానున్నందున మాతోశ్రీ వెళ్లాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు తెలిపారు.

Read more